Tuesday, April 30, 2024

Delhi | ఏపీ ప్రభుత్వ సమాచారం ఆధారంగానే తుది నిర్ణయం.. పోలవరం డయాఫ్రం వాల్‌పై కేంద్ర జల సంఘం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయాఫ్రం వాల్‌పై నిపుణుల కమిటీ సిఫార్సులు, సాంకేతిక సమాచారం ఆధారంగా వరద ప్రభావం తగ్గిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వివిధ నదుల్లో వరద పరిస్థితిపై రియల్ టైమ్ సమాచారాన్ని అందజేసే ‘ఫ్లడ్ వాచ్’ మొబైల్ అప్లికేషన్ లాంచ్ సందర్భంగా కేంద్ర జల సంఘం ఛైర్మన్ ఖుష్విందర్ వోహ్రాను పోలవరం గురించి ప్రశ్నించగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం తగ్గిన తర్వాతే డయాఫ్రం వాల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వరదల కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం తెలిసిందే.

అయితే మరమ్మత్తులు చేస్తే సరిపోతుందా లేక కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాల్సిన అవసరం ఉందా అన్న అంశంపై క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించిన తర్వాతనే నిర్ణయం తీసుకోగలమని వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ డిజైన్లపై కూడా వరద ప్రభావం తగ్గిన తర్వాత చర్చిస్తామని తెలిపారు. వరద తగ్గిన తర్వాత అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంలను కూడా పరీక్షించి తమ ముందున్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని వివరించారు. కేంద్ర జలసంఘం డిజైన్ల విషయంలోనే నిర్ణయం తీసుకుంటుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే డయాఫ్రమ్ వాల్‌పై జలసంఘం నిర్ణయం ఉంటుందని తెలిపారు. నిపుణుల కమిటీ పరిశీలించి రూపొందించిన సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లేఖ వచ్చిందని వోహ్రా ధృవీకరించారు. నిపుణుల కమిటీ సిఫార్సులు, సాంకేతిక వివరాలను పరిశీలించి, తప్పనిసరి అనుకుంటే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement