Monday, April 29, 2024

TS | జగ్గారెడ్డి జంప్ అయితుండ‌ట‌.. త్వరలోనే బీఆర్‌ఎస్‌లోకి?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ల మీద షాకులు తగులుతున్నాయి. ఒక వైపు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలు ఉంటున్నాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతుండగా, మరో వైపు సొంత పార్టీ నుంచి మరి కొందరు సీనియర్‌ నాయకులు జంప్‌ చేస్తున్నారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌ నుంచి ఇప్పటికే క్లియరెన్స్‌ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ ఆయనకే ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతోంది.

జగ్గారెడ్డి కూడా తన నియోజక వర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా పార్టీ మారుతున్న అంశాన్ని స్పష్టం చేశారని తెలిసింది. తనపై అభిమానం ఉన్నవారు రావచ్చని, తాను మాత్రం ఒత్తడి చేయనని పార్టీ కేడర్‌కు చెప్పినట్లుగా తెలిసింది. అంతే కాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు తెల్లం వెంకట్రావ్‌ గురువారం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో జగ్గారెడ్డికి మొదటి నుంచి పొసగడం లేదు. పార్టీ కార్యక్రమాల నిర్ణయం, అమలు విషయంలో రేవంత్‌రెడ్డి పార్టీ సీనియర్లను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని జగ్గారెడ్డి పలుమార్లు బహటంగానే విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement