Tuesday, May 7, 2024

ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత

ప్ర‌ముఖ తమిళ హాస్యనటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వివేక్(59) గుండెపోటుతో చెన్నైలో శ‌నివారం తెల్లవారుజామున ఐదు గంట‌ల‌కు క‌న్నుమూశారు. గురువారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆయన శుక్ర‌వారం ఉదయం సాలి గ్రామంలోని తన ఇంట్లో శ్వాస ఆడడంలేదని చెబుతూనే కిందపడి స్పృహ కోల్పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్లో జాయిన్ చేశారు. కోవిడ్‌ టీకా వేయించుకున్న 24 గంటల్లోనే వివేక్‌ పరిస్థితి విషమంగా మారడంతో పలు అనుమానాలు వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో టీకాకు గుండెపోటు సంబంధం లేద‌ని వైద్యులు తేల్చి చెప్పారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్న క్రమంలో శనివారం ఉదయం వివేక్ కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

ఆరేళ్ల ముందు వివేక్‌ కుమారుడు డెంగీ జ్వరంతో మృతి చెందాడు. అప్పటి నుంచి వివేక్ దిగులుతో సినిమాలు చేయడం తగ్గించారు. ఆయనకు తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉంది. పలు సామాజిక కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనే వారు. పర్యావరణ కార్యకర్తగా ఆయన పలు కార్యక్రమాలు నిర్వహించారు. రజనీ కాంత్, కమల్ హాసన్‌‌తో ఆయన చాలా చిత్రాల్లో నటించారు. అపరిచితుడు, శివాజీ వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి స్పందన దక్కింది.2009లో ఆయనకు కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. ఆయన మృతికి తమిళ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement