Saturday, April 27, 2024

Exclusive – స్వాతంత్ర భార‌తావ‌నిలో స్వ‌తంత్రులు! లోక్‌స‌భ బ‌రిలో ఇండిపెండెట్లు

స్వాతంత్ర భార‌త‌వ‌నిలో సామాన్యుల తీర్పే కీల‌కం. ఎన్నో రాజ‌కీయ పార్టీలు ఉన్న‌ప్ప‌టికీ చాలా ప్రాంతాల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థులు వారి ప‌నితీరుతో జ‌నాల మ‌దిని దోచుకుంటారు. దీంతో వారిపై ఉన్న న‌మ్మ‌కంతో ఓటు వేసి చ‌ట్ట స‌భ‌ల‌కు పంపిస్తారు. ఇలా దేశంలో తొలి లోక్‌స‌భ ఏర్పడ్డ‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా చాలా మంది స్వ‌తంత్రులు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అయితే.. లోక్‌స‌భ‌లో స్వ‌తంత్రుల ప్రాతినిథ్యం రాను రాను త‌గ్గిపోతోంది. తొలి నాళ్ల‌లో 37 మంది ఉన్న స్వ‌తంత్రులు మొన్న‌టి 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో కేవ‌లం న‌లుగురు మాత్ర‌మే పార్ల‌మెంట్ గ‌డ‌ప తొక్కారు. ఇందులో సినీ రంగం నుంచి వ‌చ్చిన వారిలో ఇద్ద‌రున్నారు. హీరోయిన్లుగా గుర్తింపు పొందిన సుమ‌ల‌త క‌ర్నాట‌క‌లోని మాండ్యా నుంచి, న‌వ‌నీత్ కౌర్ మ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి నుంచి గెలుపొందారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో మొత్తం 3,461 మంది స్వ‌తంత్రులుగా పోటీ చేస్తే అందులో న‌లుగురు మాత్ర‌మే విజ‌యం సాధించ‌డం విశేషం. ఇక‌.. ఈ సారి జ‌రిగే ఎన్నిక‌ల్లో స్వతంత్రుల సంఖ్య పెరిగే అవ‌కాశాలున్న‌ట్టు రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీ , ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తన అభ్యర్థుల పేర్లను ప్ర‌క‌టించ‌డంలో త‌ల‌మున‌క‌లై ఉన్నాయి.. ఇతర పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక‌పై క‌స‌రత్తు చేస్తూ గెలుపు గుర్రాల‌ను బ‌రిలోకి దింపుతున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని పార్టీల్లో టిక్కెట్లు ఆశించి, భంగపడిన వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇటువంటి వ్యవహారం దేశంలో తొలిసారి లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది.

మొదటి లోక్‌సభ ఎన్నికల్లో..

1951-52లో మొదటి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 37మంది స్వతంత్ర అభ్య‌ర్థులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండో లోక్‌సభలో స్వతంత్ర అభ్య‌ర్థుల సంఖ్య పెరిగింది. 1957లో రెండో లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 42 మంది స్వతంత్ర అభ్య‌ర్థులు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

1962లో త‌గ్గిన స్వతంత్రులు

ఇక‌.. మూడో లోక్‌సభలో స్వతంత్ర అభ్య‌ర్థుల‌ సంఖ్య సగానికి పైగా తగ్గింది. 1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 20 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎంపీలు అయ్యారు. నాలుగో లోక్‌సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య తిరిగి పెరిగింది. 1967లో జరిగిన ఎన్నికల్లో 35 మంది స్వతంత్ర అభ్య‌ర్థులు ఎన్నికయ్యారు. 1971లో ఐదవ లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికల్లో గెలిచిన స్వతంత్రుల సంఖ్య తగ్గింది. ఈ ఎన్నికల్లో 14 మంది స్వతంత్ర అభ్య‌ర్థులు మాత్రమే లోక్‌స‌భ‌కు ఎన్నికయ్యారు.

- Advertisement -

ఎమర్జెన్సీ తర్వాత..

దేశంలో ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత జరిగిన 1977 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్య‌ర్థుల‌ ప్రాతినిధ్యం తగ్గింది. ఆరో లోక్‌సభలో కేవలం తొమ్మిది మంది స్వతంత్ర అభ్య‌ర్థులు మాత్రమే ఎన్నికయ్యారు. ఏడో లోక్‌సభలో స్వతంత్ర అభ్య‌ర్థుల‌ సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. 1980లో తొమ్మిది మంది స్వతంత్రులు లోక్‌సభకు ఎన్నిక‌య్యారు. స్వతంత్ర అభ్య‌ర్థుల ప్రాతినిధ్యం 1984లో మెరుగుపడింది. ఎనిమిదో లోక్‌సభలో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర అభ్య‌ర్థుల‌ సంఖ్య 1989లో స్వల్పంగా తగ్గింది.

10వ లోక్‌సభకు ఒక్కరే..

తొమ్మిదో లోక్‌సభలో 12 మంది స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే లోక్‌స‌భ‌కు చేరుకున్నారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్య‌ర్థుల‌ ప్రాతినిథ్యం పూర్తిగా తగ్గిపోయింది. 10వ లోక్‌సభకు ఒక స్వతంత్ర అభ్య‌ర్థి మాత్రమే ఎన్నికయ్యారు. అత్యల్ప సంఖ్యలో స్వతంత్ర అభ్య‌ర్థులు 1991లో ఎన్నికయ్యారు. 11వ లోక్‌సభలో స్వతంత్ర అభ్య‌ర్థుల‌ వాటా మరోసారి పెరిగింది. 1996లో జరిగిన ఎన్నికల్లో తొమ్మది మంది స్వతంత్రులు లోక్‌సభకు ఎన్నిక‌య్యారు.

14వ, 15వ లోక్‌సభ ఎన్నికల్లో

12వ లోక్‌సభలో అంటే 1998లో స్వతంత్ర అభ్య‌ర్థుల‌ సంఖ్య ఆరుకి తగ్గింది. 1999లో 13వ లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా ఆరుగురు స్వతంత్రులు పార్లమెంటుకు చేరుకున్నారు. 14వ లోక్‌సభలో తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ లోక్‌సభ ఎన్నికలు 2004లో జరిగాయి. 2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్య‌ర్థుల‌ సంఖ్య తొమ్మది.

3,449 మంది డిపాజిట్లు గల్లంతు

16వ లోక్‌సభకు 2014లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేవలం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే లోక్‌స‌భ‌కు ఎన్నికయ్యారు. 2019లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 8,054 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వారిలో 3,461 మంది స్వతంత్రులున్నారు. ఇక‌.. మొత్తం పోటీ చేసిన అభ్య‌ర్థుల‌లో 3,449 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. కేవలం నలుగురు స్వతంత్రులు మాత్రమే పార్లమెంటుకు చేరుకున్నారు. వారిలో క‌ర్నాట‌క మాండ్యా నుంచి సుమ‌ల‌త‌, మ‌హ‌రాష్ట్ర అమ‌రావ‌తి నుంచి న‌వ‌నీత్ కౌర్ ఉన్నారు. ఈ ఇద్ద‌రూ కూడా సినీరంగ నేప‌థ్యం ఉన్న‌వారు.. అందులో హీరోయిన్స్ కావ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement