Monday, April 29, 2024

ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తావ్ కేసీఆర్ :కొండా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తుంది…ఇప్పటికీ మన రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు ఒక్క చుక్క సాగు నీరు కూడా కె.సి.ఆర్..ఇయ్యలేదన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మన రైతులకు పోయిన ఏడాది మృగశిర వరకు కాల్వల ద్వారా కృష్ణా నీళ్ళు ఇస్తానని మాటలు చెప్పి మోసం చేసిండు. ప్రాజెక్టు పరిశీలన అని, సమీక్షలు అని, కోర్టు కేసులు అని అసంబద్ధమైన కారణాలు చెప్పుకుంట ఇప్పటిదాకా మనల్ని మోసం చేస్తూ కేసీఆర్ వస్తున్నాడన్నారు. ఆంధ్ర ప్రభుత్వం కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా మనకు దక్కకుండా తీసుకుపోతుంటే సప్పుడు చెయ్యలేదు.

కనీసం కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డుకు మన హక్కులు తెలియజెయ్యలేని అసమర్థుడు కె.సి.ఆర్ అని అన్నారు. నిన్న పాలమూరు ఎత్తిపోతల పథకం సమీక్ష సమావేశం నిర్వహించిన కె.సి.ఆర్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రిని కానీ, ఇతర ప్రజా ప్రతినిధులను కానీ ఆ సమీక్షకు పిలువలేదు. దీని వెనుక ఉన్న ఆంతర్యం మనం అర్థం చేసుకోవాలి. ఎట్లైతే డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి ప్రాజెక్టు ను కాళేశ్వరంగా మార్చి మన నొట్ల మన్ను కొట్టిండో అట్లనే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పేరు మార్చి పాలమూరు ఎత్తిపోతల పథకం అని చెప్పుతున్నడు…మల్లొక్కసారి మన రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలను పూర్తిగా ఎండబెట్టడానికి కుట్ర చేస్తున్నడు. మన జిల్లా మంత్రికి, ఎం.పి.కి, ఎమ్మెల్యేలకు కొంచమైనా బాధ్యత ఉంటే కె.సి.ఆర్. ఇచ్చిన సాగు నీరు హామీ ఏమైందని మన రైతుల కోసం ఎందుకు అడుగుతలేరని ప్రశ్నించారు.

ఇక ఇదిలా ఉండగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా బీజేపీ గూటికి చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు రేవంత్ తో కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే మాత్రం కొండా అధికారికంగా స్పందించాలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement