Monday, May 6, 2024

ERP system | డిజిటలైజేషన్‌ దిశగా టీఎస్‌ఆర్టీసీ.. సేవలు మరింత సులభతరం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డిజిటలైజేషన్‌ సేవల దిశగా టీఎస్‌ఆర్టీసీ స్పీడ్‌ పెంచింది. ప్రయాణీకులకు మెరుగైన, నాణ్యమైన సేవల్ని అందించేందుకుగానూ అత్యాధునిక సాంకేతికను టీఎస్‌ఆర్టీసీ వినియోగించనుంది. ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్పీ) ప్రాజెక్ట్‌ అమలుతో డిజిటలైజేషన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 9వేలకు పైగా బస్సులు, 50 వేల మంది ఉద్యోగులు, దాదాపు 10 వేల గ్రామాలను కలుపుతూ ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల నడుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సేవలు ఆర్టీసీ అందిస్తోంది. ఇంత విస్తృత నెట్‌వర్క్‌ కలిగి ఉన్న సంస్థ అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తోంది.

డిజిటలైజేషన్‌ ఆవశ్యకతను గుర్తించి, ఈఆర్పీ ప్రాజెక్టులో భాగంగా సెంట్రలైజ్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ సొల్యుషన్‌ (సీఐఎస్‌)పై మొగ్గు చూపి వాటి సేవల్ని అందుబాటులోకి తెస్తోంది. అందుకు నల్సాప్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఓ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌ బస్‌భవన్‌లో మంగళవారం ఆ సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనర్‌ ఈఆర్పీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనర్‌ మాట్లాడుతూ సంస్థ సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈఆర్పీ ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు. పది నెలల వ్యవధి రికార్డు సమయంలో సంస్థ ఈఆర్పీ ప్రాజెక్టును అమలులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.

సీఐఎస్‌ ప్రాజెక్ట్‌ సమర్థవంతమైన ఆదాయ నిర్వహణ, వ్యయ నియంత్రణ కోసం సకాలంలో చర్యలకు దోహదపడుతోందన్నార. కేంద్రీకృత సమగ్రమైన డేటా లభ్యత, భద్రతతో పాటు మానవశక్తి వినియోగాన్ని అందిస్తుందన్నారు. అంతేకాకుండా ఆపరేషన్లపై కేంద్రీకృతం చేయడం, మార్గాలను క్రమబద్దీకరించడం, ఇంధన నిర్వహణ, వ్యక్తిగత స్టోర్‌లు, వర్క్‌షాపులు, ఆదాయ నిర్వహణ, పే రోల్‌ వంటి కార్యకలాపాల నిర్వహణలో రాష్ట్రంలోని అన్ని డిపోలు, జోన్లతో పాటు ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలన్నింటినీ ఈఆర్‌పీ ఏకీకృతం చేస్తోందని చెప్పారు.

- Advertisement -

ఈ సేవల్ని వినియోగించుకోవడంలో దేశంలోని ఆర్టీసీల్లో టీ-ఎస్‌ ఆర్టీసీ మొదటిదన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నెట్‌ వర్క్‌ను అప్‌ గ్రేడ్‌ చేశామని ఆయన తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత సామార్థాన్ని మెరుగుపరచాలనే ఉద్ధేశంతో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ సమావేవంలో నల్సాప్ట్‌ సీఈఓ నల్లూరి వెంకట్‌, హన్సఈక్విటీ పార్ట్‌నర్‌ ఎన్‌వి.త్రినాధబాబు, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు పివి.మునిశేఖర్‌, వి. వెంకటేశ్వర్లు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement