Sunday, April 28, 2024

Eluru – తోడేళ్లన్నీ ఏక‌మైనా ప్ర‌జ‌ల అండతో మ‌రోసారి విజ‌యం సాధిస్తాః జ‌గ‌న్

ఏలూరు – దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్‌ కారు ఇస్తామంటారు.కిలో బంగారం ఇస్తామంటారు.. అవి నమ్మి మోసపోవద్దు అని ప్రజలకు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా నూజివీడులో శుక్రవారం నాడు జ‌రిగిన ఒక కార్క‌క్ర‌మంలో అసైన్డు, లంక భూముల రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా జగన్‌ మాట్లాడుతూ… రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నట్లు తెలిపారు. 2003 నాటి అసైన్డ్‌ భూములకు హక్కు కల్పిస్తున్నామని… కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నట్లు వెల్ల‌డించారు.

ఇలాంటి సంక్షేమ కార్య‌క్ర‌మాలు తాను చేస్తుంటే పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదని అన్నారు. పేదవర్గాల పట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. 4వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది…సర్వే పూర్తి అయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు అని స్పష్టం చేశారు. భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్‌డేట్‌. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నాం అని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు అసైన్డ్ భూములను అత్తగారి సొత్తులా భావించి స్వాధీనం చేసుకునేవారని జగన్ గుర్తు చేశారు. చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చంద్రబాబు చేర్చారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములపై దళిత రైతుల రుణాలు మాఫీ చేస్తూ, సర్వ హక్కులు కల్పించబోతున్నామని తెలిపారు. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మూడు కేటగిరీలుగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఇక రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావిస్తూ, చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని…ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని వెల్లడించారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్‌ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్‌ చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎస్సీల్లో ఎవరైరా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫస్టోలపై కమిట్‌మెంట్‌ లేని నాయకుడు చంద్రబాబు అంటూ సీఎం వైఎస్ జగన్ ఘాటుగా విమర్శలు చేశారు.


‘సింహం సింగిల్‌గానే వస్తుంది. తోడేళ్లన్నీ ఏకమైనా ఏమీ చేయలేరు’ అని జగన్ అన్నారు. రాబోయేది ఎన్నికల సంగ్రామం అని ..ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి తనకు లేదు అని తెలిపారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని తేల్చి చెప్పేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement