Wednesday, May 8, 2024

స్వరాష్ట్రంలో విద్యుత్‌ వెలుగులు..

ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్‌ కోతలతో అల్లాడిన తెలంగాణ.. ఇప్పుడు సమృద్ధి కరెంట్‌తో రాష్ట్రం ముందుకెళ్లుతున్నది. విద్యుత్‌ ఉత్పత్తిలో మెరుగైన వృద్ధిని సాధించింది. వ్యవసాయ, గృహా అవసరాలకు లక్షలాదిగా విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య పెరిగినా.. సరఫరాలో ఎలాంటి లోపం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్ర సర్కార్‌ అందిస్తున్నది. విద్యుత్‌ వినియోగదారులకు కరెంట్‌ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు సరిపోను సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌పార్మర్స్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ను అందిస్తున్నారు. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యం 7,778 మెగావాట్లు ఉండగా.. ప్రస్తుతం 16,623 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యానికి పెరిగింది. అంటే ఈ ఏడేళ్లలో 8845 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నది.

యాదాద్రి, భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ ప్రాజెక్టులు పూర్తయితే మరో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించింది. రాష్ట్ర విభజన నాటికి కేవలం 74 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి మాత్రమే ఉండగా.. ఈ ఏడేళ్లలో 3,997 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి చేరుకున్నది. అంటే అదనంగా 3,923 మెగావాట్ల సామర్థ్యం పెరిగింది. దీంతో లక్షలాదిగా వ్యవసాయ, గృహ, కంపెనీలకు కనెక్షన్లు పెరిగినా అంతరాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ను అందిస్తున్నది.

ఈ ఏడేళ్లలో విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య లక్షల్లోనే పెరిగాయి. 2014కు ముందు తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 19,03 లక్షలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 25.92 లక్షలకు చేరింది. అంటే తెలంగాణ సర్కార్‌ అదనంగా 6.89 లక్షల (36.21 శాతం) వ్యవసాయ కనెక్షన్లను మంజూరు చేసింది. మిగతా గృహా కనెక్షన్లు, ఇండస్ట్రీయల్‌కు కలిపి 1.68 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లు ప్రస్తుతం ఉన్నాయి. గతంలో 1.11 కోట్లు విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా రాష్ట్ర విభజన తర్వాత వాటి సంఖ్య 1.68 కోట్లకు చేరింది. ఈ ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 57 లక్షల వరకు కొత్తగా విద్యుత్‌ కనెక్షన్లను మంజూరు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement