Wednesday, May 1, 2024

తాండూరులో ఎన్నికల సందడి.. నువ్వా నేనా అంటున్న లీడర్లు..

ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి : అధికార.. ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా పర్యటనలు చేయడం సహజం…కానీ తాండూరులో మాత్రం అధికార పక్షం నేతలే పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు… అక్కడ ఇప్పటికే నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముందస్తుగా ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పల్లెబాటలకు శ్రీకారం చుట్టబోతున్నారు ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి…తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి….ఇద్దరూ అధికార తెరాస ప్రజాప్రతినిధులైనా నీదారి నీది నాదారి నాది అనే పరిస్థితులు నెలకొన్నాయి….తనకే టికెట్టు వస్తుందనే ధీమాతో ఇద్దరూ ఉన్నారు…ఇప్పటికే తాండూరులో రెండు వర్గాలుగా విడిపోయారు….తమతమ వర్గాలకు కాపాడుకోవడంతోపాటు గ్రామాల్లో ప్రజల మద్దతు కూడగట్టే కార్యక్రమంలో భాగంగా పల్లెబాటకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకరు ఈ మాసం నుండే శ్రీకారం చుట్టనుండగా మరొకరు వచ్చేనెలనుండి రంగంలో దిగబోతున్నారు…..

తాండూరు నియోజకవర్గానికి అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. ఇక్కడ నాపరాళ్లకు అన్ని దేశాల్లో డిమాండ్‌ ఉంది..దాంతోపాటు రాజకీయంగా మంచి పట్టున్న నియోజకవర్గం. హైదరాబాద్‌ మహానగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నా రాజకీయ చౖైెతన్యం ఎక్కువే.. ఈ నియోజకవర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి…తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి పోటీపడుతున్నారు. తమకంటే తమకే టికెట్టు వస్తుందనే ధీమాతో ఇద్దరూ ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలో దిగిన పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పట్నం మహేందర్‌రెడ్డి స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు. ఏడాది గడవక ముందే పైలెట్‌ రోహిత్‌రెడ్డి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తెరాసలో చేరిన వారందరికీ మరోసారి టికెట్టు లభించిన నేపథ్యంలో 2024లో జరిగే ఎన్నికల్లో తనకే టికెట్టు వస్తుందనే ధీమాతో పైలెట్‌ ఉన్నారు. గతంలో తెదేపా ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారికి 2018లో జరిగిన ఎన్నికల్లో టికెట్టు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. తనకు టికెట్టు గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు.

ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్సీ కాళీ ఏర్పడింది. దీంతో ఉప ఎన్నికలో పట్నం మహేందర్‌రెడ్డి బరిలో దిగి విజయం సాధించారు. రెండున్నర ఏళ్లకే ఎమ్మెల్సీ పదవి పూర్తి అయ్యింది. దీంతో ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్సీగా పట్నం మహేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం రెండుసార్లు ఎమ్మెల్సీగా విజయం సాధించిన నేపథ్యంలో ఈసారి టికెట్టు తనకే పక్కా అని పట్నం మహేందర్‌రెడ్డి పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా ఆయన ఎక్కువ సమయం తాండూరుకే కేటాయిస్తున్నారు. ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా తాండూరులో ప్రత్యక్షమవుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయమున్నా నేతల మధ్య నువ్వా నేనా అనే గట్టి పోటీ కొనసాగుతోంది. ఇద్దరూ కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నా ఏదో మోహమాటానికి పలకరించుకోవడం తప్పిస్తే ఎవరిదారి వారిదేలా ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఎమ్మెల్సీ వర్గం…ఎమ్మెల్యే వర్గంగా విడిపోయారు. నువ్వా నేనా అన్నట్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాండూరు తనదేనని పైలెట్‌ అంటుండగా తాండూరును వదిలేది లేదని పట్నం పేర్కొంటున్నారు…..మొత్తం మీద నియోజకవర్గంలో అధికార పక్షం,,,ప్రతిపక్షం

ఈనెల 21నుండి పైలెట్‌ పల్లెబాట…

గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా పట్టు సాధించేందుకు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు. అధికారక కార్యక్రమాలతోపాటు పల్లెల్లో బాగోగులు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. అందులో భాగంగానే ఈనెల 21నుండి పల్లెపల్లెకు పైలెట్‌ పేరుతో పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ముందుగా యాలాల మండలం నుండి తన పర్యటనలు ప్రారంభించనున్నారు. శంకుస్థాపనలు….ప్రారంభోత్సవాలతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రజల కష్టసుఖాలను తెలుసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజల మధ్య ఉండాలని సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు తాను పల్లెబాటకు శ్రీకారం చుట్టబోతున్నారు. వారంలో నాలుగు రోజులపాటు పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. నియోజకవర్గం మొత్తం సుడిగాలి పర్యటనలు చేయాలని నిర్ణయించారు.

- Advertisement -

మే మాసంలో పట్నం బాట…

సుడిగాలి పర్యటనలకు మారుపేరుగా నిలిచే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మే మాసంలో తాండూరు నియోజకవర్గంలో పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రతి చిన్న కార్యక్రమాలకు హాజరయ్యే మహేందర్‌రెడ్డి నేరుగా గ్రామాలకు వెళ్లి సీనియర్లు…జూనియర్లతోపాటు నేరుగా గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు నడుం బిగించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తొలి మంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ వెంటనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. తాజాగా డిసెంబర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాండూరునుండే బరిలో దిగాలని గట్టిగా భావిస్తున్నారు. ఈసారి కూడా తనకే టికెట్టు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఎమ్మెల్సీ…ఎమ్మెల్యే పల్లెబాటకు శ్రీకారం చుట్టబోతుండటంతో అందరూ తాండూరు వైపే చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement