Thursday, May 2, 2024

బీఆర్ఎస్‌కు ఈసీ షాక్.. ఏపీలో రాష్ట్ర పార్టీ గుర్తింపు ఉపసంహరణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చి జాతీయస్థాయిలో విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదాను ఉపసంహరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్‌ను తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా గుర్తిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ & అలాంట్‌మెంట్) ఆర్డర్, 1968లోని పారా 6 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం వల్ల రాష్ట్ర పార్టీ హోదాను కోల్పోయింది. ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ & అలాంట్‌మెంట్) ఆర్డర్, 1968 ప్రకారం ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర పార్టీగా గుర్తింపు దక్కాలంటే ఆ పార్టీ 5 అంశాల్లో ఏదైనా ఒక దాంట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఆ ప్రకారం

1. ఆ రాష్ట్రంలో చివరిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లుబాటైన ఓట్లలో కనీసం 6% ఓట్లతో పాటు కనీసం 2 సీట్లు గెలుచుకోవాలి

- Advertisement -

2. ఆ రాష్ట్రంలో చివరిసారిగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చెల్లుబాటైన ఓట్లలో కనీసం 6% ఓట్లతో పాటు కనీసం 1 సీటైనా గెలుచుకోవాలి

3. ఆ రాష్ట్రంలో చివరిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అసెంబ్లీ సీట్లలో కనీసం 3% సీట్లు లేదా కనీసం 3 సీట్లు గెలుపొందాలి

4. ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి 25 సీట్లకు కనీసం ఒక సీటును గెలుచుకోవాలి

5. ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు మొత్తం పోలైన ఓట్లలో కనీసం 8% ఓట్లు సాధించాలి

ఈ పై 5 నిబంధనల్లో ఏ ఒక్కటి సాధించినా ఆ పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందుతుంది. అప్పటికే రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ తన గుర్తింపును కొనసాగించుకోగల్గుతుంది. ఎప్పుడైతే ఈ 5 నిబంధనల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోతే ఆ పార్టీ రాష్ట్ర పార్టీ హోదాను కోల్పోతుంది. తద్వారా ఎన్నికల్లో పోటీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే ‘ఉమ్మడి గుర్తు’ను కోల్పోయే పరిస్థితి తలెత్తుంది.

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయలేదు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి షోకాజ్ నోటీసులు పంపించింది. తమకు మరికొంత గడువిస్తే పై నిబంధనల్లో ఏదైనా ఒకటి సాధించి రాష్ట్ర పార్టీ హోదాను నిలబెట్టుకుంటామని బీఆర్ఎస్ తన సమాధానంలో పేర్కొంది. అయితే 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ సహా 21 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, కానీ ఆ పార్టీ అర్హత సాధించలేకపోయిందని ఈసీ పేర్కొంది. భవిష్యత్తులో అర్హత సాధించినప్పుడు రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును కలిగి ఉందని ఈసీ స్పష్టం చేసింది.

జాతీయ పార్టీ ఆప్.. ఈ హోదా కోల్పోయిన సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీ

ఢిల్లీతో పాటు పంజాబ్‌లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో 6% కంటే ఎక్కువ ఓట్లను పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు జాతీయ పార్టీగా గుర్తింపునిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చివరి సారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లుబాటైన ఓట్లలో 6 శాతం ఓట్లు సాధించాలి. ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.

గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నిబంధనల ప్రకారం అర్హత సాధించి జాతీయ పార్టీగా గుర్తింపు పొందగా.. ఈ నిబంధనలను చేరుకోలేకపోయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లకు జాతీయ పార్టీ గుర్తింపును ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

అలాగే ఉత్తర్ ప్రదేశ్‌లో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), పశ్చిమ బెంగాల్‌లో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పీ)లకు రాష్ట్ర పార్టీ హోదాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కొత్త పార్టీలకు రాష్ట్ర పార్టీ హోదా లభించింది. త్రిపురలో తిప్రా మోతా పార్టీకి, మేఘాలయలో వాయిస్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీకి, నాగాలాండ్‌లో లోక్ జనశక్తి (రాంవిలాస్) పార్టీకి రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు దక్కింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement