Friday, April 26, 2024

జపాన్‌లో భారీ భూకంపం..ఈ నెలలో రెండోసారి

జపాన్‌లోని హోన్‌షు తూర్పు తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఉదయం 5:28 గంటలకు భూకంపం సంభవించిందని తెలిపింది. ప్రసిద్ధ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రానికి దగ్గరగా భూకంపం సంభవించినప్పటికీ ఇప్పటి వరకు.. ప్రకంపనల ప్రభావంపై నివేదికలు అందలేదని చెప్పింది. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని, అయితే ఇప్పటి వరకు నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొంది. 2011లో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపానికి సునామీ రాగా.. 15వేల మందికి పైగా మృతి చెందారు. అలాగే ఫుకుషిమా అణు కర్మాగార విపత్తుకూ కారణమైంది.

ఈ నెల ప్రారంభంలో జపాన్ ఈశాన్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) తెలిపింది. భూకంపం కేంద్రం పసిఫిక్ మహాసముద్రంలో 60 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. దీంతో టోక్యోతో సహా దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని చెప్పింది. ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ పేరిట పిలిచే భూకంప జోన్‌లో జపాన్‌ ఉందని, దీంతో భారీ భూకంపాలు సంభవిస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement