Friday, April 26, 2024

డాక్టరమ్మగా మారిన గవర్నర్… అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి చికిత్స

హైదరాబాద్: వృత్తి రీత్యా వైద్యురాలైన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఒకరి ప్రాణాలు కాపాడారు. దిల్లీ – హైదరాబాద్ ఇండిగో విమానంలో అస్వస్థకు గురైన వ్యక్తికి గవర్నర్‌ తమిళిసై ప్రాథమిక చికిత్స చేశారు. వారణాసి వెళ్లిన గవర్నర్ శుక్రవారం అర్ధరాత్రి దిల్లీ – హైదరాబాద్ ఇండిగో విమానంలో తెలంగాణకు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రయాణ సమయంలో ఒక వ్యక్తి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన విమాన సిబ్బంది.. ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులున్నారా? అని అడగడంతో తమిళి సై స్పందించారు. వెంటనే అస్వస్థతకు గురైన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి ఉపశమనం కలిగించారు. ప్రాథమిక చికిత్సతో కోలుకున్న వ్యక్తి సహా ఇతర ప్రయాణికులు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సరైన సమయంలో స్పందించిన విమాన సిబ్బందిని తమిళి సై అభినందించారు. విమానంలో ప్రాథమిక చికిత్సకు సంబంధించిన కిట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. విమాన ప్రయాణాల్లో వైద్యులు ఎవరైనా ఉంటే ముందే వారి వివరాలను అందుబాటులో ఉంచే విధంగా ఒక విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు విమాన సిబ్బందికి సీపీఆర్‌పై కనీస అవగాహన ఉండేలా శిక్షణ ఇస్తే బాగుంటుందన్నారు. సిబ్బందితో పాటు సామాన్యులు కూడా సీపీఆర్ చేసే విధానంపై శిక్షణ తీసుకుంటే ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement