Friday, May 3, 2024

అలిపిరి కాలినడక భక్తులకు ఇక‌పై అలిపిరి వ‌ద్దే దివ్యదర్శనం టోకెన్లు

తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపి టోకెన్లు పొందొచ్చు. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం 2083వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించబడరు. భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. కాగా వాహనాల్లో తిరుమలకు చేరుకోవాలనుకునే భక్తులకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ (ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి టీటీడీకి సహకరించాలని కోరడమైనది.

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో ఏడుకొండలపైన ఉన్న కంపార్ట్‌మెంట్లలో 13 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 81,305 మంది దర్శించుకోగా 34,342 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement