Monday, May 6, 2024

నిప్పుతో చెలగాటమొద్దు, ఆయుధాలివ్వడమంటే యుద్ధంలో ఆజ్యం పోయడమే.. రష్యా ఫైర్‌

ఉక్రెయిన్‌కు హిమ్సార్‌ వంటి అత్యాధునిక రాకెట్‌ వ్యవస్థలను అందివ్వడమంటే యుద్ధాన్ని మరింత రాజేయడమేనని, అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని రష్యా మండిపడింది. ఇరు దేశాలమధ్య యుద్ధం మరింత తీవ్రదశకు, ముఖాముఖి పోరును ఉధృతమయ్యేలా చేయడమని వ్యాఖ్యానించింది. క్రెవ్లిున్‌ అధికార ప్రతినిధి పెస్‌కోవ్‌ ఈ మేరకు స్పందిస్తూ అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఉక్రెయిన్‌ సైనికులను ముందుపెట్టి వెనకనుంచి అమెరికా తమపై పోరాడుతున్నట్లుందని ఎద్దేవా చేశారు. రష్యా భూభాగంలోని లక్ష్యాలపై తామిచ్చే హిమ్సార్‌ ఆయుధ వ్యవస్థలను ఉపయోగించరాదని అమెరికా షరతుపెట్టినప్పటికీ ఉక్రెయిన్‌ కట్టుబడి ఉంటుందని తాము భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ రష్యా భూభాగంలోని లక్ష్యాలపై ఆ వ్యవస్థలను ప్రయోగిస్తే రష్యా ఎలా స్పందిస్తుందన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ అలాంటి పీడకలలాంటి ఊహలు వద్దని అన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బోస్‌ ప్రాంతంలో రష్యా దూసుకుపోతోంది.

మాస్కో బలగాల ధాటికి ఉక్రెయిన్‌ దళాలు వెనక్కు వెళ్లక తప్పడం లేదు. రష్యా ఆయుధ వ్యవస్థ ముందు ఉక్రెయిన్‌ నిలబడలేకపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికా 700 మిలియన్‌ డాలర్ల ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది. ఆ ఆయుధాలు ఉక్రెయిన్‌కు చేరితే రష్యాకు ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు. అందుకే బిడెన్‌ ప్రకటన వెలువడిన వెంటనే స్పందించి అక్కసు వెళ్లగక్కింది. కాగా డాన్‌బోస్‌ ప్రాంతంలోని పెద్దపట్టణం సీవీరొడోనెట్‌స్క్‌ ప్రాంతంలో 70 శాతం మేర రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని లుషాంక్‌ గవర్నర్‌ సెర్‌హీయ్‌ హైడాయ్‌ ధ్రువీకరించారు. సీవీరోడోనెట్‌స్కీతోపాటు పక్కనే ఉన్న లిసిచాన్‌స్కీ పట్టణంలోనూ రష్యా బలగాలతో భీకరయుద్ధం కొనసాగుతోంది, దాదాపు వీధిపోరాటంలా అక్కడి పరిస్థితి ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. కష్టంగానే ఉన్నప్పటికీ ఉక్రెయిన్‌ సైనికులు రష్యాను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు. కాగా ఉక్రెయిన్‌ తమ లక్ష్యమే కాదని, ఆ దేశానికి మద్దతు ఇస్తున్న నాటో కూటమిపై యుద్ధం చేస్తున్నామని, ఇప్పటికే మూడో ప్రపంచయుద్ధంలోకి అడుగుపెట్టామని రష్యా అధికార టీవీ చానల్‌ వన్‌ ప్రకటించింది. ఈ చానల్‌లో గంట నిడివిగల చర్చావేదికలో వ్యాఖ్యాత సహా చర్చలో పాల్గొన్న వారంతా అమెరికా, నాటో, ఐరోపా కూటమి దేశాలపై విరుచుకుపడ్డారు.

రష్యాకు ఎదురుదెబ్బ..

తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా దూసుకుపోతున్నప్పటికీ సైన్యంలో ప్రాణనష్టం మాత్రం తగ్గడం లేదు. ప్రధానంగా బలగాలను ముందుకు నడిపించాల్సిన కల్నల్‌, జనరల్‌ స్థాయి అధికారులను పెద్దసంఖ్యలో కోల్పోతోంది. తాజాగా చెచెన్‌ యుద్ధవీరుడు రమ్‌జాన్‌ కడిరోవ్‌కు సన్నిహితుడైన రష్యన్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ జౌర్‌ దిమయెవ్‌ మంగళవారంనాడు యుద్ధక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయారు. లుషాంక్‌లో ఉక్రెయిన్‌ బలగాల దాడిలో అతడు మరణించాడు. కాగా ఇప్పటివరకు ఉక్రెయిన్‌ బలగాల చేతుల్లో రష్యా 49మంది ఉన్నత సైనికాధికారులను కోల్పోయింది. చెచెన్‌కు చెందిన ప్రత్యేక బెటాలియన్‌కు దిమయేవ్‌ డిప్యూటీ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.డాన్‌బోస్‌ ప్రాంతంలోని లుషాంకా కమిషెవఖా ప్రాంతానికి తన ఎస్‌యూవీ వాహనంలో వెడుతూండగా ఉక్రెయిన్‌ ఫిరంగిదళం కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గతనెలలో రష్యాలోనే పేరుమోసిన పారాట్రూప్‌ దళంలోని కీలక సభ్యుడు అలెగ్జాండర్‌ దోస్యాగయెవ్‌ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే రక్షణశాఖలోని సమాచార విభాగానికి చెందిన కల్నల్‌ వ్లాదిమిర్‌ ఇవనోవ్‌ కూడా కొద్దిరోజుల క్రితం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలయ్యాక రష్యా దాదాపు 3300 మంది సైనికులను, 49మంది సైనిక అధికారులను కోల్పోయింది. ఈ యుద్ధంలో రష్యా 500 యుద్ధ ట్యాంకులను నష్టపోయింది. యుద్ధం ప్రారంభమైనపుడు 1.5 లక్షలమంది సైనికులు పాల్గొంటే ఇప్పుడు రష్యా సేనలు 1.2 లక్షలకే పరిమితమైనారని అమెరికా మంగళవారం ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement