Wednesday, May 15, 2024

కిడ్నీ రోగులకు డయాలసిస్‌ ఫ్రీ.. రాష్ట్ర వ్యాప్తంగా 40 ఉచిత కేంద్రాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్యం విప్లవాత్మకరీతిలో మెరుగుపడుతోంది. ఒకప్పుడు ”నేను రాను బిడ్డో… సర్కారు దవాఖానకు…” అని పాడుకునే రోజులు పోయి ”సర్కారు దవాఖానకే పోతా” అనే పరిస్థితులు వచ్చాయి. రాష్ట్రంలోని పీహెచ్‌సీలు కూడా ఇప్పుడు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెక్కాడితే కాని డొక్కాడని పేద కుటుంబాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్థులకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ (రక్త శుద్ధి) కేంద్రాలు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగానే అందిస్తున్నాయి. కిడ్నీ రోగులకు ప్రాణపదంగా మారుతున్నాయి. వారానికి మూడుసార్లు ఉచితంగానే డయాలసిస్‌ సేవలు దగ్గరలోని జిల్లా కేంద్రంలోనే అందుతుండడంతో నిరుపేద కిడ్నీ రోగులపాలిట ఇవి సంజీవనిగా నిలుస్తున్నాయి. నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రాల్లో ఉచిత డయాలసిస్‌ కేంద్రాలను వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. ఒకప్పుడు కిడ్నీ వ్యాధికి చికిత్స అంటే ప్రయివేటులో లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. లేదంటే హైదరాబాద్‌లోని సర్కారు పెద్దాస్పత్రులకు వెళ్లాలి.

అయితే ఇప్పుడు జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లోనే కిడ్నీ వ్యాధులకు ఉచిత చికిత్స అందుబాటులోకి వచ్చింది. జిల్లా కేంద్రాల్లోనూ ఉచిత డయాలసిస్‌ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌తోపాటు వరంగల్‌, జగిత్యాల, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల కేంద్రాల్లోని ఉచిత డయాలసిస్‌ సెంటర్లు విజయవంతంగా కిడ్నీ రోగులకు సేవలందిస్తున్నాయి. ప్రతి ఉచిత డయాలసిస్‌ కేంద్రంలో రోజూ కనీసం 25మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఉచిత డయాలసిస్‌ సేవలు అందిస్తున్నారు. ఇందుకోసం 5 షిఫ్ట్‌ల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచారు. సాధారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్థులకు డయాలసిస్‌ ద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తారు. ఒక్కో రోగి రక్తాన్ని శుద్ధి చేయాలంటే నాలుగు గంటల సమయం పడుతుంది. ప్రతి డయాలసిస్‌ కేంద్రంలో అత్యాధునిక వైద్య పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. నాలుగు బెడ్లను సాధారణ కిడ్నీ రోగులకు కేటాయించగా… ఒక బెడ్‌ను ప్రత్యేకంగా జిల్లాలోని ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థుల కోసం వినియోగిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగానే డయాలసిస్‌ సేవలు అందజేస్తున్నాయి. ఉచిత డయాలసిస్‌ సెంటర్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రత్యేకంగా కేటాయిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 40 ఉచిత డయాలసిస్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి. డయాలసిస్‌ కేంద్రాలకు వచ్చేందుకు పేషెంట్లకు ఉచిత బస్‌పాస్‌ సౌకర్యాన్ని కల్పించింది. జిల్లా కేంద్రాల్లో ఉచిత డయాలసిస్‌ కేంద్రాలు అందుబాటులోకి రానపుడు కిడ్నీ రోగులు హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు వెళ్లేవారు. దాంతో ప్రయాణ ఖర్చులే రానుపోను దాదాపు రూ.3 వేల దాకా అయ్యేవి. దీంతోపాటు హైదరాబాద్‌ ఆస్పత్రికి వెళ్లాక డయాలసిస్‌ చేయించుకునేందుకు రెండు, మూడు రోజులపాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉండేవి. దీంతో కిడ్నీ రోగులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లోనే నిరుపేద కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి రావడంతో అన్ని రకాలుగా మేలు జరుగుతోందని కిడ్నీ రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అన్ని పట్టణాల్లోనూ ఉచిత డయాలసిస్‌ కేంద్రాలు- మంత్రి హరీష్‌రావు..

రానున్న రోజుల్లో జిల్లాల్లోని ముఖ్యపట్టణాల్లో ఉన్న ఏరియా ఆస్పత్రుల్లోనూ ఉచిత డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుపేద కిడ్నీ రోగులు డయాలసిస్‌ చేయించుకునేందుకు అనేక వ్యయ ప్రయాసలకోర్చి సుదూరంలోని ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో కిడ్నీ రోగులకు వైద్యం భారంగా మారింది. ఈ నేపథ్యంలో నిరుపేద కిడ్నీ రోగులను ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కిడ్నీ రోగుల సంఖ్యకు తగినట్లుగా డయాలసిస్‌ మిషన్లను ఏర్పాటు చేస్తున్నాం. రోగుల వెయిటింగ్‌ సమయాన్ని తగ్గించాలని, సత్వరం డయాలసిస్‌ సేవలు అందించాలని అధికారులను ఆదేశించాం. త్వరలో ఎయిడ్స్‌, హెపటైటిస్‌ రోగులకు కూడా ఉచిత డయాలసిస్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement