Saturday, May 4, 2024

ఏపీ కొత్త‌ జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం..

ప్రభన్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేయడంతోపాటు పోర్టులకు, విమానాశ్రయాలకు రోడ్డు మార్గాలు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని కేంద్ర రహదారుల కార్యదర్శి ఎ.గిరిధర్‌ పేర్కొన్నారు. సోమవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్‌ కార్యాలయంలో రాష్ట్రంలోని జాతీయ రహదారులు మరియు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రవాణా సులభతరం కొరకు రాష్ట్రంలో లక్ష యాభై వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణ పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయన్నారు. బెంగళూరు నుంచి విజయవాడ వరకు రెండు రాష్ట్రాల రహదారులను కలుపుతూ రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు సంబంధించి మరో నాలుగైదు నెలల్లో టెండర్లు పిలుస్తున్నారన్నారు. ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ దాదాపు పూర్తి కావచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో త్వరలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల రాజధానులను కలుపుతూ ఎక్స్‌ ప్రెస్‌ వే లాంటి రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు జాతీయ రహదారుల అనుసంధానం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని, వీటిని నాలుగైదు సంవత్సరాల్లో నేషనల్‌ ఇన్ఫాస్ట్ర్రక్చర్‌ పై్లపన్‌ పథకం ద్వారా పూర్తి చేస్తామన్నారు. ప్రధానమంత్రి గతిశక్తి పథకం ద్వారా ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు ఆర్థికాభివృద్ధికి సాధించేందుకు అవకాశం మెండుగా ఉంటుందో ఆ ప్రాంతాలలో నౌకాశ్రయాలతోపాటు విమానాశ్రయాలకు రహదారుల అనుసంధానం కొసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నూతనంగా ఏర్పాటు కావడం ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలున్నాయని, ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి రాష్ట్రీయ రహదారి అభివృద్ధి అవసరమని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement