Thursday, May 2, 2024

ధరణి తిప్పలు.. పోర్టల్‌తో తీరని సమస్యలు

ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌ : ధరణిలో ఏర్పడ్డ లోపాలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ప్రభుత్వం మొదట అధికారులతో, తర్వాత మంత్రులతో కమిటీలను నియమించింది. అయినా ఇప్పటికీ పరిష్కార మార్గాలు మాత్రం బాధితులకు దొరకడం లేదు. కమిటీల సూచన మేరకు ధరణి పోర్టల్‌లో ఆప్షన్లు ఇచ్చినా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం చేదు అనుభవమే మిగులుతోంది. నెలలు గడుస్తున్నా దరఖాస్తు చేసుకున్నవారి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ప్రజల దరఖాస్తులు మొదట జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి అక్కడి నుంచి సంబంధిత తహసీల్‌ కార్యాలయాలకు చేరుతున్నాయి. తహసీల్దార్‌ రికార్డులను పరిశీలించి సరైన నివేదికను కలెక్టర్‌కు పంపిస్తే దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది. కాని తహసీల్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌కు వెళ్లే నివేదికల సమర్పణలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఫలితంగా ఆప్షన్లు ఇచ్చినా దరఖాస్తు చేసుకున్న వారికి సమస్యలు పరిష్కారం కావడం లేదు.

సవరణలో.. వసూళ్ల పర్వం

ధరణిలో అమలులో ఏర్పడ్డ లోపాలను సవరించే క్రమంలో రెవెన్యూ కొందరు అధికారులు వసూళ్లకు తెరలేపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమి జాబితాలో పట్టా భూములను చేర్చారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న భూములను అమ్ముకొనలేక, కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. భూమి దక్కుతుందో లేదో అన్న భయంతో అధికారులు, పెట్టుకున్న దళారులకే రూ.లక్షలు ముట్టజెప్పి పనులు చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముడుపులు ముట్టచెప్పకుంటే దరఖాస్తులు రిజక్ట్‌ చేస్తున్నారు. ఇలా పలు మండలాల్లో ఒక్కో భూ యజమాని మీ-సేవ కేంద్రాల్లో ఐదారు సార్లు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్న పరిష్కారం లభించలేదు. ఆ కారణంగా రిజక్ట్‌ చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల పొరపాట్ల సవరణకు ప్రజలు ముడుపులు ముట్టజెప్పందే పనికాని పరిస్థితి నెలకొంది.

పోర్టలంతా లోపాల పుట్ట…

భూ ప్రక్షాలన సమయంలో సరియైన వివరాలు నమోదు చేయకపోవడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రతి గ్రామంలో వందల ఎకరాల్లో భూములకు రికార్డుల పరంగా వివిధ చిక్కులు ఏర్పడ్డాయి. సర్వే నెంబర్లు ధరణిలో కనిపించడం లేదు. మరికొంత మందికి విస్తీర్ణంలో తేడాగా నమోదైంది. వ్యవసాయ భూములు ఇళ్ల స్థలాలుగా రికార్డు చేయడంతో చాలా మంది రైతులు రైతుబంధు పొందడం లేదు. కొన్నేళ్లకింద భూమిని అమ్మేసిన ఇంకా ధరణి పోర్టల్‌లో వారికి హక్కులు కల్పించి కొత్త పట్టాపాసు పుస్తకాలను జారీ చేశారు. దీంతో కొన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొంత మంది పట్టా భూములు ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే భూసమస్యల చిట్టా పెద్దదిగానే తయారవుతుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement