Thursday, May 2, 2024

Big story | ధరణి మరింత కొత్తగా.. రంగంలోకి రెవెన్యూ శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విపక్షాలకు ఎటువంటి విమర్శలకు ఎన్నికల ఏడాదిలో తావులేకుండా చేస్తున్న సర్కార్‌ ధరణి లోటుపాట్లపై దృష్టిసారించింది. స్వల్ప లోపాలను అధిగమించి అద్భుతంగా రైతులకు సాయమందించేలా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగానే అనేక అంశాలపై అధ్యయనం చేసి లోపాలను వేగంగా తీరుస్తోంది. తాజాగా నిషేదిత భూముల జాబితా క్లీయరెన్స్‌లో ప్రభుత్వం వేగం పెంచింది. అన్ని జిల్లాల కలెక్టర్లు తమవద్ద ఉన్న ధరణి రికార్డులలోని జాబితాను మండల తహశీల్దార్‌లకు పంపించి వివరాలు తెప్పించుకున్నారు.

ఈ రికార్డులను సీసీఎల్‌ఏకు చేరవేసి సుమోటోగా పరిష్కరిస్తున్నారు. ఇలా పాస్‌ పుస్తకాలు జారీ అయినప్పటికీ నిషేదిత జాబితాలో ఉన్నవాటినే పంపించగా, వీటికి కూడా కొందరు క్లీయరెన్స్‌ కోరుతూ దరఖాస్తులు చేయలేదు. దీంతో స్వతహాగా ప్రభుత్వమే క్లీయర్‌ చేయాలని నిర్ణయించడంతో ఈ పని వేగంగా జరుగుతోంది. 11 లక్షల ఎకరాల భూములకు హక్కులులేవని పాస్‌ పుస్తకాలు నిరాకరించిన హక్కుల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. ఇంకా మరో 3.5లక్షల మందికి పెండింగ్‌లకు చెందిన పాస్‌ పుస్తకాల జారీతోపాటు 2.5లక్షల మంది రైతులకు చెందిన రికార్డుల తప్పుల సరిజేత దిశగా శ్రమిస్తోంది.

తాజాగా తీసుకొచ్చిన టీఎం 33 మ్యాడ్యూల్‌కు అనుబంధంగా మరో 8 మాడ్యూల్స్‌ అందుబాటులోకి తెచ్చారు. వీటన్నింటికి చెందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ, నోటీసుల జారీ పురోగతిలో ఉంది. ప్రధానంగా పేరులో మార్పులు, చేర్పులు, విస్తీర్ణంలో మార్పులు, సర్వే నెంబర్‌ తొలగింపు, ఎన్వోసి, ఓఆర్సీ, 38ఈ, 13బి, సర్వే నెంబర్‌ను భిన్నమైన ఖాతాలకు మళ్లించడం, అసైన్డ్‌ భూములను పట్టాభూములుగా రికార్డుల మార్పు, ల్యాండ్‌ నేచర్‌, ల్యాండ్‌ టైప్‌ మార్చడం, మిస్సింగ్‌ నెంబర్‌, కొత సర్వే నెంబర్‌ను సృష్టించడం, కొత్త ఖాతా సృష్టి, లావాదేవి నిలుపుదల, ఖాతాల విలీనం వంటి వాటిపై స్పష్టత రావడంతో మెజారిటీ సమస్యలు పరిష్కారమవుతున్నాయి.

మరికొన్ని…

భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూముల సర్వే నెంబర్లలలోని మొత్తం పట్టా భూములను నిషేదిత జాబితాలో చేర్చడం, కోర్టు కేసులు, ఇతర వివాదాలున్న సర్వే నెంబర్లను ఈ జాబితాలో ఉంచడం, వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో కొన్ని సర్వే నెంబర్లలోని భూములు నమోదు కాలేదు. ఈ మిస్సింగ్‌ డేటాను సేత్వార్‌, ఖాస్రా పహాణీలో ఉన్న విస్తీర్ణం కంటే తక్కువగా ఉండే వాటి నమోదుకు అవకాశం కల్పించి ఆయా రైతులు రైతుబంధు, రైతు భీమా పథకాలకు అర్హులుగా మార్చాలని ప్రయత్నిస్తోంది.

- Advertisement -

నాలా మార్పిడితో రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతారని, ఈ భూములను అమ్ముకునేందుకు, బ్యాంకులలో తనఖా పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. వ్యవసాయేతర భూమిగా నమోదైన వ్యవసాయ భూమిని భూమి వర్గీకరణ మార్పుకు అవకాశం కల్పించి రైతులకు పాస్‌ పుస్తకాల అందజేత వంటి పరిష్కారాలను యోచిస్తున్నారు. గజాలలో ఉన్న భూములకు కూడా మ్యుటేషన్‌ అవకాశం కల్పించాలని, ప్రభుత్వ అసైన్డ్‌ భూముల విషయంలో అమ్మకాలు, కొనుగోలు మినహా మిగతా వ్యవహారాలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదనంగా డిజిటల్‌ సంతకాలు, తప్పుల సవరణలకు అవకాశం కల్పించాలని కూడా సిఫార్సులు చేయనున్నారు. నిషేదిత భూముల జాబితాను సబ్‌ డివిజన్‌ నెంబర్ల ఆధారంగా తిరిగి నమోదు చేయాలని, సంబంధంలేని మిగతా భూములను జాబితానుండి తొలగించనున్నారు. స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీతో క్రయవిక్రయదారులకు అవకాశం ఇచ్చే దిశగా యోచిస్తున్నారు. సర్వే నెంబర్‌ విస్తీర్ణంలో మార్పులకు, ఆధార్‌కు బదులుగా సంస్థ పాన్‌ కార్డుతో రిజిస్ట్రేషన్లకు అవకాశం పరిశీలిస్తున్నారు. తిరస్కరించిన మ్యుటేషన్‌ దరఖాస్తులకు మళ్లి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అమలులోకి తేనున్నారు. సంస్థ భాగస్వాముల రిజిస్ట్రేషన్‌లో సీఐఎన్‌ బదులుగా పాన్‌ నెంబర్‌ను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా సీసీఎల్‌ఏ కార్యాలయంలో నిషేదిత భూముల తొలగింపు కసరత్తులో భాగంగా ఖాస్త్రా పహాణీనుంచి ధరణి పహాణి రికార్డు వరకు పరిశీలిస్తున్నారు. 2020 సెప్టెంబర్‌కు ముందు రికార్డులు, ఆ తర్వాత రికార్డులను జాగ్రత్తగా పరిశీలించి స్వతహాగా నిషేదిత జాబితాలోనుంచి తోఒఒలగిస్తున్నారు. ఇలా పలు భూములు కార్డులో నిషేదిత జాబితాలో, ధరణిలో పట్టా భూములుగా ఉన్నాయి. ఈ భిన్నమైన పద్దతిని సవరించేందుకు సర్కార్‌ ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ఎండోమెంట్‌, వక్ఫ్‌, భూదాన్‌ గ్రామకంఠం, ప్రభుత్వ ఆఫీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన భూములు, అటవీ, జంగ్లత్‌, బంజరు, సీలింగ్‌, అసైన్డ్‌ భూములను ఇందులో చేర్చారు.

ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తరతరాలుగా సాగుచేసుకుంటున్న మా పట్టాభూములను నిషేదిత జాబితానుంచి తొలగించండి. ధరణి పోర్టల్‌లో మార్పులు చేయండి అని ప్రభుత్వానికి లక్షలాదిగా ధరఖాస్తులు చేరాయి. దీంతో ప్రభుత్వమే సుమోటాగా సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగింది. ఆ భూముల వివరాలను పరిశీఇలంచి సమస్యలను పరిష్కరిస్తోంది. ఈ ప్రక్రియ గురించి రైతులకు ఎటువంటి సమాచారం లేకుండా పోయింది. రైతుల ప్రమేయం లేకుండానే కలెక్టర్‌లు పంపిన భూముల వివరాలను ఆ వివరాల్లో ఉన్న భూముల రికార్డులను పరిశీలించి తహశీల్దార్లు ఇచ్చే నివేదికలు, వాటి ఆధారంగా కలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలు, ఆ భూములను నిషేదిత జాబితానుంచి తొలగించారా…లేదా అనే అంశాలపై బైటికి సమాచారం ఇవ్వడంలేదు. ఇప్పుడు అన్నీ తీరిపోనున్నాయి.

ధరణిలో పరిష్కారం కోరుతూ రైతులు నేరుగా చేసిన ఫిర్యాదులపై కదలిక వస్తున్నది. ఈ ఫిర్యాదులను జిల్లాల వారీగా వేరు చేసి కలెక్టర్లకు పంపి వివరాలను తీసుకున్నారు. వీటిని వీలైతే సుమోటాగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఈ పోర్టల్‌ రాకతో ఏళ్లనాటి భూ సమస్యలు తీరుతున్నాయి. రాష్ట్రంలోని సుమారు 60లక్షల మందికి చెందిన భూముల రికార్డులు క్లీయర్‌గా ఉండటంతో రైతుబంధు, రైతుబీమా వంటివి నేరుగా అందుతున్నాయి. ధరణిలోని గ్రీవెన్స్‌ మ్యాడ్యూల్‌ ద్వారా సమస్యలు పరిష్కారమవుతున్నాయి.

అధికారులకు విచక్షణాధికారాల కోతతో అక్రమాలు తగ్గాయి. అయినా పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంవంటివి అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. సీసీఎల్‌ఏ, రిజిస్ట్రేషన్‌, ఐటీ విభాగాలకు చెందిన అధికారులను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. ఈ రెండు వెసులుబాట్లు వినియోగించుకునేలా సర్కార్‌ వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. సత్వరమే ఆయా ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement