Wednesday, May 8, 2024

Delhi | హిమాచల్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు.. సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉత్తరాదిలో జలప్రళయాన్ని సృష్టించిన వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన నలుగురు తెలుగు ఆర్కిటెక్ట్ విద్యార్థుల వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఢిల్లీలోని ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’లో చదువుకుంటున్న విద్యార్థులు స్టడీ టూర్‌తో పాటు విహార యాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ఆ బృందంలో నలుగురు విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. పార్వతి వ్యాలీలోని కసోల్ గ్రామంలో ఉండగా చివరిసారిగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆ తర్వాత వారి ఫోన్లు అందుబాటులోకి లేకుండా పోయాయి.

మరోవైపు వర్షాలు, వరదల ఉధృతి పెరిగి ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడ్డ వార్తలు, వరదల్లో భవనాలు, వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలను వార్తా ప్రసారాల్లో చూసిన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లల ఆచూకీ తెలియడం లేదని, చివరిసారిగా తమతో మాట్లాడి మూడు రోజులవుతుందని మంత్రి కేటీ రామారావుకు చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన్ను ఆశ్రయించి సహాయం కోరారు. వెనువెంటనే స్పందించిన ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అప్రమత్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ అధికారులతో మాట్లాడి విద్యార్థుల ఆచూకీ తెలుసుకోవాలని, వారికి కావాల్సిన సహాయం అందజేయాలని ఆదేశించారు. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా కూడా వెల్లడించారు.

- Advertisement -

కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన తెలంగాణ భవన్

మంత్రి కేటీఆర్ ఆదేశాలతో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భవన్ ఉద్యోగులు వందన, రక్షిత్ నాయక్‌లకు కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించి హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం పంపించారు.

విద్యార్థులు సురక్షితం

కసోల్ గ్రామంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు వంగరి రాహుల్, సుమంత్, సుమీత్‌తో పాటు తెలుగమ్మాయి కూడా సురక్షితంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం సమయంలో వారంతా కసోల్ నుంచి బయటికొచ్చి కులు వైపుకు ప్రయాణం సాగించారు. కులు విమానాశ్రయం ఉన్న బుంతర్ వరకు చేరుకోగలిగినట్టు విద్యార్థుల్లో ఒకరైన వంగరి రాహుల్ ‘ఆంధ్రప్రభ’కు తెలిపారు. తెలంగాణ భవన్ అధికారులు కూడా తమతో మాట్లాడుతున్నారని, ప్రస్తుతం తాము సురక్షితంగా ఓ హోటల్‌లో ఉన్నామని చెప్పారు. అయితే బుంతర్ నుంచి మండి వరకు వెళ్లే రహదారిలో కొండచరియలు విరిగిపడ్డ కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి మరమ్మత్తు పనులు పూర్తయితేనే రోడ్డు మార్గం ద్వారా బయటపడగలరు. లేదంటే కులు నుంచి చండీగఢ్ వరకు విమానం ద్వారా చేరుకునే అవకాశం కూడా ఉంది. మంగళవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతోనే తాము బయటపడగలిగామని విద్యార్థులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement