Thursday, December 7, 2023

Delhi | మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్.. షరతులతో మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్ట్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టై జైల్లో ఉన్న మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గాయపడి ఆస్పత్రిలో చేరిన తన అమ్మమ్మను చూసేందుకు వీలు కల్పిస్తూ బెయిల్ ఇవ్వాలన్న మాగుంట రాఘవ రెడ్డి అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు మన్నించింది. రెండు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో తెలుగు రాష్ట్రాలకు ప్రముఖ పారిశ్రామిక వేత్త, అరబిందో గ్రూప్ డైరక్టర్ శరత్‌చంద్ర రెడ్డి అప్రూవర్‌గా మారడం కూడా రాఘవ రెడ్డి బెయిల్ పొందడానికి ఉపయోగపడిందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మద్యం పాలసీ అక్రమాల్లో మనీ లాండరింగ్ అంశాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) మాగుంట రాఘవను ఈ ఏడాది ఫిబ్రవరి 10న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడైన రాఘవ ఢిల్లీలో పలు రిటైల్ జోన్లను చేజిక్కించుకుని మద్యం వ్యాపారం చేశారు. అయితే మద్యం పాలసీ రూపొందించ ముందు నుంచే ఢిల్లీ ప్రభుత్వ పెద్దలతో కలిసి మంతనాలు సాగించారని, తమకు అనుకూలంగా పాలసీ నిబంధనలు ఉండేలా చేసి అందుకు రూ. 100 కోట్లు సౌత్ గ్రూప్ తరఫున అడ్వాన్సుగా ముడుపులు చెల్లించారని దర్యాప్తు సంస్థలు ఆరోపించారు.

- Advertisement -
   

తాము చెల్లించిన ముడుపులకు ప్రతిఫలంగానే మాగుంట ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రిటైల్ జోన్ల కేటాయింపు, ఇండో స్పిరిట్స్ సంస్థలో భాగస్వామ్యం, డీలర్ కమిషన్ పెంపు సహా అనేక రకాలుగా కిక్ బ్యాక్స్ అందాయని పేర్కొంది. తీవ్ర ఆరోపణలు, అభియోగాల నేపథ్యంలో మాగుంట రాఘవ ట్రయల్ కోర్టు (రౌజ్ అవెన్యూ కోర్టు)లో బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. బెయిల్ నిరాకరించడంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే రాఘవ అమ్మమ్మ బాత్రూమ్‌లో జారిపడి గాయపడ్డారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అమ్మమ్మను చూసేందుకు వీలు కల్పిస్తూ 6 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.

కోర్టులో వాదోపవాదనల సందర్భంగా మధ్యంతర బెయిల్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. 83 ఏళ్ల రాఘవ అమ్మమ్మ బాత్రూమ్‌లో జారపడడంతో ముక్కుకు గాయమైందని, అయితే ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పారని వివరించారు. ఆమె బాగోగులు చూసుకునే బంధువులు చాలామందే ఉన్నారని, పైగా ఐసీయూలో ఉండగా రోగిని చూడడం కుదరదని వాదించిన ఆయన వాదించారు. మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 45 ప్రకారం ఇలాంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయడం సరికాదని గుర్తుచేశారు.

కేసులో నిందితుల బంధువులు బాత్రూంలో జారిపడి గాయపడుతున్నారని, వారిని చూడడం కోసం మధ్యంతర బెయిల్ కోరుతున్నారని రాజు అన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం కొన్ని షరతులతో రాఘవ తన అమ్మమ్మను చూసేందుకు అనుమతి కల్పించింది. ఈ క్రమంలో రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement