Wednesday, May 8, 2024

Delhi | దమ్ముంటే నాపై పోటీ చెయ్.. నారా లోకేశ్‌కు ఎంపీ భరత్ సవాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ తెలుగుదేశం నేత నారా లోకేశ్‌కు సవాల్ విసిరారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎంపీలపై టీడీపీ నేతల విమర్శలపై స్పందించారు. వైకాపా ఎంపీలను చూస్తే నవ్వొస్తోంది అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ..

లోకేశ్‌ను చూసి రాష్ట్ర ప్రజలంతా నవ్వుకుంటున్నారని, రాజకీయాల్లో ఆయనొక కమేడియన్ అని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగి సాధించిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము కేంద్రంతో సఖ్యతతో ఉంటూ విభజన హామీలు అనేకం సాధించామని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ‘ది బెస్ట్’ అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా మెచ్చుకున్నారని, ఎప్పుడు చూసినా రహదారుల ప్రాజెక్టుల గురించే తనను తరచుగా కలుస్తూ ఉంటారని ఆయన చెప్పారని భరత్ గుర్తుచేశారు.

దేశంలో అత్యధిక మొత్తంలో రహదారులకు నిధులు సాధించుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని, తన నియోజకవర్గం పరిధిలోనే రూ. 10 వేల కోట్ల ప్రాజెక్టులు సాధించానని వెల్లడించారు. అలాంటి తనను రీల్స్ హీరో అంటూ ఎలా ఎద్దేవా చేస్తారంటూ ప్రశ్నించారు. “దమ్ముంటే.. చంద్రబాబు వారసుడివే అయితే.. తనపై పోటీ చేసి గెలువు” అంటూ నారా లోకేశ్‌కు ఎంపీ భరత్ సవాల్ విసిరారు. అప్పుడు ఎవరు హీరో అన్నది తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

విభజన చట్టంలో ప్రత్యేక హోదా.. సవరణలతో ప్రైవేట్ మెంబర్ బిల్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేలా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014’లో సవరణలు ప్రతిపాదిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ భరత్ సహా మొత్తం 10 మంది ప్రైవేట్ మెంబర్ బిల్లు రూపొందించారు. శుక్రవారం లోక్‌సభలో ఈ బిల్లును ఆ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విభజన హామీల అమలుపై గతంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.

అయితే అందులో ఆర్థికపరమైన అంశాలు ఉన్నందున, ఫైనాన్స్ బిల్లుగా పరిగణించాల్సి ఉంటుందని, ఆ క్రమంలో లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలని సూచించినందున తాము లోక్‌సభలో ప్రవేశపెట్టామని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని అన్నారు. తాము ప్రవేశపెట్టిన బిల్లులో ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించడం, వాల్తేరు డివిజన్‍‌ను కలుపుకుంటూ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి వంటి హామీలకు కూడా మరింత స్పష్టతనిస్తూ సవరణలు ప్రతిపాదించామని చెప్పారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాల ఆమోదంపై మిథున్ రెడ్డి కూడా ఒక ప్రైవేట్ బిల్లు పెట్టారని భరత్ తెలిపారు. విభజన హామీలపై.. గత ప్రభుత్వంలో చంద్రబాబు యూ-టర్న్‌ తీసుకుని రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారని, ఆ తప్పిదాలను సవరించుకుంటూ రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకుంటున్నామని అన్నారు. కేంద్రంతో సఖ్యంగా ఉంటూనే తాము చేస్తున్న ఒత్తిడి కారణంగా కేంద్రం ఈ మధ్యనే రెవెన్యూ లోటు నిధులు రూ. 10 వేల కోట్లు విడుదల చేసిందని గుర్తుచేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు రూ. 12 వేల కోట్ల మేర అదనపు నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధపడిందని అన్నారు.

మణిపూర్‌పై చర్చ జరగాలి

తాము ప్రతి విషయంలోనూ కేంద్రానికి మద్దతిస్తున్నామంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, అంశాలవారిగా దేశానికి మంచి జరుగుతుంది అనుకున్నవాటికే తాము మద్దతిస్తున్నామని భరత్ స్పష్టం చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు విషయంలో తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని, తెలుగుదేశం పార్టీయే గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోందని అన్నారు. పూర్తిగా రాష్ట్రం, పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతం కాని ఢిల్లీలో శాంతిభద్రతలు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండాలన్న ఆలోచనతో తాము బిల్లుకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అదే సమయంలో మణిపూర్ అంశంపై చర్చ జరగాలని తాము కూడా కోరుకుంటున్నామని అన్నారు. ఇతర పార్టీల మాదిరిగా కాకుండా ఈ చర్చలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్మాణాత్మక సూచనలు చేస్తామని అన్నారు.

అప్పులపై ప్రశ్నలతో ఆ నేతలు అభాసుపాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిమితికి మించి అప్పులు చేస్తోందని ఆరోపిస్తున్న తెలుగుదేశం నేతలు పార్లమెంటులో ఆ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగి అభాసుపాలవుతున్నారని మార్గాని భరత్ అన్నారు. టీడీపీ ఎంపీలతో పాటు తమ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందని నిరూపించాలనుకున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వ సమాధానాలతో సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టయిందని అన్నారు. ఏపీ మొత్తం అప్పు రూ.4,42,442 కోట్లు ఉండగా, అందులో 2019 నుంచి 2023 వరకూ రూ.1.77 లక్షల కోట్లు అప్పు చేశారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారని చెప్పారు. ఈ నిధులను అనేక రంగాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా నాడు-నేడు కింద విద్య, వైద్య రంగాల్లో సమూలమైన, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలను తీసుకొచ్చామని చెప్పారు. ఇదంతా మూలధన వ్యయం కాదా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement