Tuesday, May 14, 2024

Delhi | కార్మికుల సంక్షేమానికి నిధి ఏర్పాటు చేయాలి : ఎంపీ జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కార్మికుల సంక్షేమానికి జాతీయ భవన, నిర్మాణ కార్మికుల నిధిని ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావనలో ఆయన మాట్లాడారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం 1996లోని నిబంధనల ప్రకారం నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో ఒక శాతం సెస్‌గా సేకరిస్తాయని, అలా సేకరించిన డబ్బు కేంద్ర చట్టాల ప్రకారం కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర నిర్మాణ కార్మికుల బోర్డులకు బదిలీ చేయట్లేదని ఆరోపించారు.

5 కోట్ల మంది భవన, ఇతర నిర్మాణ కార్మికులు వివిధ రాష్ట్ర నిర్మాణ కార్మికుల బోర్డులలో పేర్లు నమోదు చేసుకున్నారని, అయితే విద్యా సహాయం, వివాహం, ప్రసూతి ప్రయోజనాలు, వైద్య  సహాయం కోసం అర్హులైన వారి సంక్షేమ ప్రయోజనాల కోసం లక్షల క్లెయిమ్‌లు రాష్ట్ర కార్మికుల బోర్డులలో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రజల నుంచి వసూలు చేసిన వేల కోట్ల సెస్ నిధులు ప్రభుత్వాల వద్ద నిరుపయోగంగా ఉన్నాయని జీవీఎల్ తెలిపారు. కోవిడ్ కాలంలో ఈ సెస్ నిధులను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను పదేపదే కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సలహాలను పెడచెవిన పెట్టి భవన కార్మికుల సంక్షేమాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశాయని ఆయన ఆరోపించారు. 

- Advertisement -

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ క్లెయిమ్‌ల అందజేతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. కార్మికులకు సంక్షేమ ఫలాలు మెరుగ్గా అందేలా చూడడానికి, వసూళ్లు చేస్తున్న సెస్ నుండి జాతీయ భవన నిర్మాణ కార్మికుల నిధిని ఏర్పాటు చేసేందుకు బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ ఖర్చుల చట్టం, 1996, బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ చట్టాన్ని  సవరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి ఇతర కేంద్ర పథకాల మాదిరిగానే కార్మికులకు సంక్షేమ ప్రయోజనాలను నేరుగా జాతీయ నిర్మాణ కార్మికుల నిధి నుంచి నేరుగా డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారులకు చెల్లించాలని, అలా వారిని సకాలంలో ఆదుకునే అవకాశం ఉంటుందని జీవీఎల్ నరసింహారావు ప్రతిపాదించారు.

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వసూలు చేసిన సెస్ నిధులను దారి మళ్లించి ఇతర అవసరాలకు వాడుకుని కార్మికుల సంక్షేమాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి వారికి అందవలసిన పరిహారాన్ని అందించకుండా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశాయని, అది భవన కార్మికులను మోసం చేయడమేనని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement