Sunday, April 28, 2024

Delhi | పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలి.. రేపు రైల్వే కార్మికుల మహా ధర్నా!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రైల్వేలో పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ఎన్ఎఫ్ఐఆర్(నేషనల్ ఫెడరేషన్ అఫ్ ఇండియన్ రైల్వేమెన్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని యూనియన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, తమ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 10న రాంలీలా మైదానంలో మహా ప్రదర్శన చేపడుతున్నామని ప్రకటించారు. ఈ మహా ధర్నాలో లక్ష మంది కార్మికులు పాల్గొంటారని తెలిపారు. మహా ప్రదర్శన అనంతరం తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు.

కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని రాఘవయ్య చెప్పారు. ముఖ్యంగా కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా జాయింట్ ఫోరమ్ స్థాపించామని చెప్పారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ తో కార్మికులకు నష్టం జరుగుతోందని, వెంటనే ఈ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. సామాజిక రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అంటూ సుప్రీం కోర్టు తీర్పు చెబుతోందని రాఘవయ్య గుర్తుచేశారు. 2014 నుంచి కొత్త పెన్షన్ విధానం అమలులోకి వచ్చిందని, అప్పటి నుంచే కార్మికులకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. భారత సైన్యానికి అమలు చేస్తున్నట్టే రైల్వేలోనూ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని రైల్వే మాజీ మంత్రులు మల్లికార్జున ఖర్గే, సురేష్ ప్రభులు లిఖితపూర్వకంగా నివేదిక ఇచ్చినా సరే కేంద్రం చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement