Monday, May 6, 2024

WGL: సమన్వయంతో పనిచేస్తే నేరాల నియంత్రణ మరింత సులభం.. ఏవీ రంగనాథ్

పోలీసులు ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులతో సమన్వయంతో పనిచేస్తే నేరాల నియంత్రణ సాధ్యపడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలియజేసారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులు కొద్ది రోజుల క్రితం జరిగిన వరుస ఆపార్టుమెంట్ల చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. వారి నుండి రూ.2 కోట్ల విలువైన రెండు కిలోలకు పైగా బంగారు అభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈసందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ దర్యాప్తు బృందానికి పూర్తి సహకారాన్ని అందించి నిందితులను పట్టుకోవడంలో కీలకంగా నిలిచిన కర్నూలు జిల్లా నాల్గవ పట్టణ ఇన్ స్పెక్టర్ శంకరయ్యతో పాటు స్టేషన్ కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, నాగరాజులను వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ… అంతరాష్ట్ర నేరస్థులను పట్టుకోవడంలో ప్రధాన భూమిక పోషించిన ఇన్ స్పెక్టర్ శంకరయ్యతో పాటు వారి సిబ్బంది ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సంచలన కేసుల్లో నిందితులను ఎంత తక్కువ సమయంలో అరెస్టు చేస్తే ప్రజలకు పోలీసులపై అంత నమ్మకం పెరుగుతుందన్నారు. అలాగే ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన పోలీసులు నేరస్థుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఎలాంటి నేరస్థులనైనా పట్టుకోవడం చాలా సులభమవుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ దాసరి మురళీధర్, క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య, ఇన్ స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యప్రసాద్, శంకర్ నాయక్, కరుణాకర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement