Thursday, May 16, 2024

ఇంట్లో నిల్వ ఉంచలేక… మార్కెట్‌కు తెస్తే ధర రాక విలవిలలాడుతున్న పత్తి రైతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా ధర పెరుగుతుందని ఆశించిన పత్తి రైతులకు నిరాశే మిగులుతోంది. గతేడాది జనవరిలో పత్తి క్వింటాల్‌కు రూ.12వేల ధర పలికింది. మార్చి నాటికి అది రూ.14వేలకు చేరింది. గతేడాది అనుభవం దృష్ట్యా ధర మరీ రూ.12వేలకు మించి రాకున్నా కనీసం రూ.10వేల వరకు వస్తే చాలనుకున్న పత్తి రైతులు పంట దిగుబడినిఇళ్లలోనే నిల్వ చేశారు. ఈ ఏడాది నవంబరులో రూ.9వేల దాకా పలికిన క్వింటాల్‌ పత్తి ధర పెరగాల్సింది పోయి రోజు రోజుకూ తగ్గి ప్రస్తుతం రూ.6900 నుంచి రూ.7100 కే పరిమితమైంది. దీంతో ధర వస్తుందని ఇంట్లోనే నిల్వ చేసిన పత్తిని తక్కువ ధరకు అమ్ముకోలేక… మరోవైపు ఇల్లలో నిల్వ చేసుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి పత్తిని నిల్వ ఉంచడంతో రంగు మారిపోతోంది. రోజు రోజుకూ గోదుమ, నలుపు రంగులోకి మారడంతోపాటు ముక్క వాసన వస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

- Advertisement -

ఈ ఏడాది రాష్ట్రంలో దాదాపు 40లక్షల ఎకరాల్లో పత్తి సాగయింది. గతేడాదితో పోల్చుకుంటే వరిసాగు పెరగడంతో ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. అదే సమయంలో అధిక వర్షాలతోపాటు చీడ,పీడలు దాడి చేయడంతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఎకరాకు కనీసం 8 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా… 5 క్వింటాళ్లకే పరిమితమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి తగ్గినందున ధర బాగా వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ఈఏడాది పత్తికి డిమాండ్‌ బాగా ఉంటుందని, పత్తి సాగును రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రోత్సహించింది.

పత్తికి ధర ఇంకా పెరిగే అవకాశముందని , రైతులు తొందరపడి అక్టోబర్‌, నవంబరులోనే పంటను అమ్ముకోవద్దని వ్యవసాయాధికారులు రైతులకు సూచించారు. మార్కెట్‌ పరిస్థితులను, వ్యవసాయశాఖ సూచలను నమ్మి పత్తి దిగుబడులను రైతులు నవంబరు మొదలు ఇప్పటి దాకా తమ ఇళ్లలోనే నిల్వ ఉంచారు. ఇప్పటికే మూడు నెలలుగా రైతులు ఇంట్లోనే పత్తిని నిల్వ ఉంచారు. దీంతో రంగుమారడంతోపాటు పత్తి నాణ్యత దెబ్బతింటుండడం అదే సమయంలో ధర పెరగకపోవడంతో చేసేదేమీ లేక విక్రయించేందుకు మార్కెట్‌కు పత్తిని తీసుకువస్తున్నారు.

ఇదే అదనుగా రంగు మారిందని, బస్తాల్లో తొక్కే సమయంలో నీళ్లు చల్లడంతో తేమ ఉందన్న సాకుతో రైతులను వ్యాపారులు నిలువుదోపీడీ చేస్తున్నారు. తమ మాయాజాలంతో రైతులను అందినకాడికి దోచుకుంటున్న పరిస్థితులు పలు వ్యవసాయ మార్కెట్లలో నిత్యకృత్యమయ్యాయి. పత్తికి ప్రస్తుతం మద్దతు ధర రూ.6500 ఉండగా… కేవలం రూ.400ఎక్కువకు రూ.6900 మాత్రమే ధర పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు పెడుతున్న రూ.6900కు క్వింటా పత్తిని అమ్మితే వచ్చిన ఆదాయం నుంచి వాహన కిరాయి, హమాలీ, కూలీల, పెట్టుబడి వ్యయం తీసేయగా తమకు ఏమి మిగలడం లేదని రైతులు వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement