Sunday, April 28, 2024

Bhuvanagiri గురుకుల పాఠ‌శాల‌లో క‌లుషిత ఆహారం.. విద్యార్థి మృతి

భువనగిరి ప్రభుత్వ గురుకుల హాస్టల్ లో బ్రేక్‌ ఫాస్ట్‌లో భాగంగా పులిహోర తిన్న 24మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జిబ్‌లక్‌పల్లికి చెందిన ప్రశాంత్ మృతి చెందాడు.

కాగా, ఈ నెల 12వ తేదీన‌ బ్రేక్‌ ఫాస్ట్‌ కోసం కలిపిన పులిహోరను విద్యార్థుల‌కు అందించారు. దీంతో 24 మంది విద్యార్థులు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచానాలతో ఇబ్బంది పడ్డారు. విషయం గమనించిన యాజమాన్యం అందరినీ దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలించారు. చికిత్స పొందుతూ అత‌ను మ‌ర‌ణించాడు.

ఇది ప్రభుత్వ హత్యే… ప్రవీణ్ కుమార్

గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ గురుకుల పాఠశాల కార్యదర్శి బిఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఆ పసి బాలుడి చావు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని బిఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఇంతకంటే ఇంకేమైనా ఘోరం ఉంటదా? అని ప్రశ్నించారు.

గురుకుల పాఠశాలల్లో క్షేత్ర స్థాయి నియంత్రణ లోపించిందని, వ్యవస్థను చక్కదిద్దండి అని తాను ఎన్నో సార్లు వేడుకున్నా సీఎం రేవంత్ గుండె కరగడం లేదని విమర్శలు గుప్పించారు. పాఠశాలల్లో కౌన్సిలర్లు పెట్టమని వేడుకున్న కరుణించే నాధుడే లేడని, గత నాలుగు నెలలు ప్రతీకార రాజకీయాలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితమైందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ చేతకాని కాంగ్రెస్‌ను అర్జంటుగా ఇంటికి పంపిద్ధామని పిలుపునిచ్చారు. మన బిడ్డల ప్రాణాలను మనం కాపాడుకుందామని రండి అని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement