Monday, May 13, 2024

అంతర్జాతీయ ప్రమాణాలతో గోదాముల నిర్మాణం.. 12 రాష్ట్రాల్లో మొదలు కానున్న పనులు

అమరావతి, ఆంధ్రప్రభ : వ్యవసాయోత్పత్తుల నిల్వల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారీ గోదాముల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు అనుబంధంగా గోదాముల నిర్మాణం చేపట్టేందుకు దేశవ్యాప్తంగా పైలట్‌ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ప్రపంచంలోని అతి పెద్ద ఆహార ధాన్యాల నిల్వ, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు (వరల్డ్‌ లార్జెస్ట్‌ గ్రెయిన్‌ స్టోరేజ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టు) అమలు కోసం నిధులను కూడా భారీగా సమకూరుస్తుంది.

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ది బ్యాంకు (నాబార్డు) కన్సల్టెన్సీ సర్వీస్‌ (నాబ్కాన్స్‌) అధ్యయనం ఆధారంగా పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా అన్ని ఒక్కొక్క సహకార పరపతి సంఘాన్ని ఎంపిక చేసి దానికి అనుబంధంగా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు. తొలిదశలో నిర్మిస్తున్న 12 ప్రాజెక్టుల్లో ఏపీకి కూడా స్థానం లభించింది. ఈ ప్రాజెక్టు కోసం పశ్చిమగోదావరి జిల్లా అచంటలోని మృత్యుంజయ సహకార సమితిని నాబ్కాన్స్‌ ఎంపిక చేసింది. నాబ్కాన్స్‌ బృందం వివిధ దశల్లో రాష్ట్రంలో పర్యటించి సహకార సమితి ఆదాయ వ్యయాలు, మెరుగైన ఫలితాల సాధనను పరిగణలోకి తీసుకుని అచంట సమితిని ఎంపిక చేశారు.

ఈ మేరకు నాబ్కాన్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కేంద్రానికి సమర్పించగా నూతన ప్రాజెక్టు కోసం అచంట సహకార సమితి ఎంపికైంది. అచంటలో ప్రభుత్వం కేటాయించిన రెండెకరాల స్థలంలో ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఈనెలాఖరులోపు శంఖుస్థాపన చేసి ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేయాలని నాబ్కాన్స్‌ భావిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ 21.4 కోట్లతో ఆహార ధాన్యాల కోసం మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. 500 మెట్రిక్‌ టన్నుల సామర్దంతో కూడిన అత్యాధునిక గోదామును నిర్మించనున్నారు.

- Advertisement -

గంటకు రెండు టన్నుల సామర్దంతో కూడిన అత్యాధునిక కలర్‌ సార్టెక్స్‌ రైస్‌ మిల్లు నిర్మాణం కోసం రూ 1.12 కోట్లను వ్యయం చేయనున్నారు. అచంట సహకార సమితికి ప్రత్యేకంగా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ కింద డ్రోన్‌ ను కూడా సమకూర్చనున్నట్టు నాబ్కాన్స్‌ వెల్లడించింది. ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 20 శాతం ఎంపికైన సహకార సమితి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పీఏసీఎస్‌ లను రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)కు అనుసంధానం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటు-ందని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement