Monday, April 29, 2024

పార్టీని చంపే కుట్ర.. ఎక్కడైనా ‘వారి’ పెత్తనమే : అద్దంకి దయాకర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ సజీవంగా ఉంటేనే నేతలకు బతుకు ఉంటుందని, కానీ పార్టీని చంపే కుట్ర జరుగుతోందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం తెలంగాణా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ నేత కొప్పుల రాజును కలిసి పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దయాకర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పార్టీ విషయంలో జరుగుతున్న అవకతవకలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం దయాకర్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14 తర్వాత రాహుల్ గాంధీని కలిసి మరిన్ని విషయాలను ఆయనకు వివరిస్తానని అన్నారు. గత ఎన్నికల్లో తుంగతుర్తిలో తన ఓటమికి కారణమైన వ్యక్తుల్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థిగా రవి అనే వ్యక్తిని నిలబెట్టడంతో అతనికి 2,800 ఓట్లు వచ్చాయని, తాను 1800 ఓట్ల తేడాతో ఓడిపోయానని అప్పటి సంగతులను అద్దంకి దయాకర్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడినా సరే రవి విత్ డ్రా చేసుకోలేదని, దీంతో ఏఐసీసీ రవిని ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిందని వివరించారు. అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా తనపై కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పార్టీ ప్రయోజనాలు తాకట్టు..

మరోవైపు ఎన్నికల్లో ఖర్చు కోసం పార్టీ తనకెలాంటి సొమ్ము ఇవ్వకపోయినా నాలుగు కోట్లు ఇచ్చినట్టు రాసుకున్నట్టు తనకు ఆలస్యంగా తెలిసిందని దయాకర్ తెలిపారు. పైగా తాను నియోజకవర్గానికి రావడం లేదని ప్రచారం చేస్తున్నారని, తనను ఎవరైనా కార్యక్రమాలకు ఆహ్వానిస్తే బెదిరిస్తున్నారని వాపోయారు. పీసీసీ చీఫ్‌గా ఎవరుంటే తాను ఆ వర్గంలో ఉంటానని, ఏఐసీసీ కూడా పీసీసీ చీఫ్ చెప్పినట్టుగా నడుచుకోమనే చెబుతుందని అన్నారు. ఉద్యమం నుంచి సోనియా గాంధీ ఆహ్వానం మేరకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానన్న దయాకర్, వర్గాల పోరులో మళ్లీ ఓడిపోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్, క్రమశిక్షణా కమిటీ చిన్నారెడ్డికి ఈ అంశాలపై ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ ఎంపీలని, దామోదర్ రెడ్డి మాజీ మంత్రి వారి మాటకు విలువ ఇవ్వకపోతే ఎలా అంటూ రేవంత్ రెడ్డి నిస్సహాయుడిగా మారి తనకే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము ఉద్యోగులం కాదు, వ్యాపారులం కాదు. 24 గంటలూ రాజకీయాల్లో ఉండే నేతలమని తేల్చి చెప్పారు. ఇసుక మాఫియాతో కుమ్మక్కై వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడుతున్నారని దయాకర్ ఆరోపించారు.

సామాజిక సమతుల్యం పాటించాలి..

భట్టి విక్రమార్క చేసుకుంటున్నట్టు నేతలు ఎవరి నియోజక వర్గాల్లో వారు పని చేసుకుంటే మంచిదని, ఎస్సీ నియోజకవర్గంలో ఇందులో ఎందుకు వేలు పెడుతున్నారని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో 54 శాతం బీసీలు ఉండగా జిల్లాలోని 14 సీట్లలో ఎస్సీ, ఎస్టీలకు 3 పోగా మిగతా సీట్లలో ఒక్కటే బీసీలకు ఇస్తున్నామని, మిగతావన్నీ రెడ్లకే ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న బీసీ కులాలు కాంగ్రెస్ నుంచి విడిపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీలో బీసీలు, ఇతర వర్గాలకు టికెట్లు ఇస్తున్నారని, ఇలాంటప్పుడు సామాజిక సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని దయాకర్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం నల్గొండ సమస్యే కాదన్న ఆయన, 31 నియోజక వర్గాల్లో ఈ పరిస్థితి ఉందని, ‘ఫర్ సేల్’ అన్నట్టుగా నియోజకవర్గాలను మార్చేశారని తీవ్రంగా విమర్శించారు.

- Advertisement -

అమలు కాని పార్టీ రాజ్యాంగం..

ఎస్సీ, ఎస్టీ సీట్లు అంటే ఎదిగిన నేతలకు ఇవ్వాల్సిన సీట్లు తప్ప, పక్క పార్టీల్లోని నేతలకు పిలిచి ఇచ్చే సీట్లు కావని అన్నారు. బానిసల్లా ఉండేవారికే సీట్లు అన్నట్టుగా చేస్తున్నారన్న ఆయన, తాను మీ బానిసగా ఉంటానని చెప్పినా ఎవరూ నమ్మడం లేదని చెప్పుకొచ్చారు. తానే గెలవని నేతలు ఇంకొకరికి టికెట్ ఎలా సూచిస్తారని ప్రశ్నించారు. ప్రతి ఎంపీ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో 2 బీసీలకు ఇవ్వాలని మా పార్టీ రాజ్యాంగంలోనే ఉందని, కానీ అదెక్కడా అమలు కావడం లేదని చెప్పుకొచ్చారు. అంతర్గత విభేదాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావడమే కాక క్షేత్రస్థాయిలోనూ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 70 ఏళ్ల వయసున్న నేతలు ఇప్పటికీ రాజకీయం చేస్తుంటే, 30 ఏళ్ల వయస్సున్న వారికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందని దయాకర్ నిలదీశారు. మాణిక్యం టాగోర్, కేసీ వేణుగోపాల్‌ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలవడానికి సిఫార్సు చేస్తామన్నారని వెల్లడించారు.

ఈసారైనా పీసీసీ చీఫ్ బీ-ఫాం ఇచ్చేనా..?

కాంగ్రెస్ పార్టీని గెలిపించేది నాయకులు కాదు ప్రజలేనన్న ఆయన, నాయకులను నమ్ముకుంటే ఒరిగేదేమీ లేదని అన్నారు. ఆ ముగ్గురిపై తాను వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయలేదని, కానీ జరుగుతున్న తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తాను పుట్టుకతో కాంగ్రెస్‌తో ఉన్నవాణ్ణి కాదని, తెలంగాణ ఇచ్చారన్న కృతజ్ఞతతోనే సోనియా గాంధీ కోరితే ఈ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. మొదటిసారి సోనియా, రెండోసారి రాహుల్ గాంధీ తనకు టికెట్ ఇచ్చారని, ఈసారైనా ఈ పీసీసీ చీఫ్ బీ-ఫాం ఇస్తారని ఎదురుచూస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement