Thursday, May 16, 2024

Delhi | యూపీలో 11 లోక్‌సభ సీట్లు ఇస్తాం.. అఖిలేష్ డీల్, ఒప్పుకోని కాంగ్రెస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విపక్ష కూటమి (I.N.D.I.A)లో లుకలుకలు పెరిగి చీలికల దిశగా అడుగులు పడుతున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సీట్ల సర్దుబాటు కసరత్తు మొదలుపెట్టారు. మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 11 బలమైన సీట్లను కేటాయిస్తున్నట్టు ప్రతిపాదించారు. అయితే ఈ డీల్ తమకు ఓకే కాదంటూ కాంగ్రెస్ అధినాయకత్వం తేల్చి చెప్పేసింది.

అయితే ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని, కాంగ్రెస్ గెలవగలిగే స్థానాలు, అభ్యర్థులు ఉంటే ఆ సంఖ్య పెంచడానికి అఖిలేశ్ యాదవ్‌కు అభ్యంతరం ఏమీ లేదని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా పొరుగు రాష్ట్రం బిహార్‌లో విపక్ష కూటమి నుంచి బయటపడి ఎన్డీఏ గూటికి నితీశ్ కుమార్ తిరిగివెళ్తున్న సమయంలో.. పొత్తుల్లేవు, ఒంటరిపోరాటమేనని బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన తరుణంలో అఖిలేశ్ యాదవ్ చొరవ తీసుకుని విపక్ష కూటమిలో కదలిక తీసుకొచ్చారు.

- Advertisement -

అప్పటికే కాంగ్రెస్ తీరుపై అఖిలేశ్ విమర్శలు చేశారు. మిత్రపక్షాలతో సంప్రదింపులు, మంతనాలు చేయడం లేదని, సీట్ల సర్దుబాటుపై ఎటూ తేల్చకపోతే కష్టమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలంగా లేని రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీకే నిర్ణయాధికారమని గతంలో ప్రకటించిన కాంగ్రెస్, ఉత్తర్‌ప్రదేశ్‌లో 50 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇది అత్యాశే అయినప్పటికీ.. ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో సాధించే సీట్లే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా మారతాయన్నది అందరికీ తెలిసిన విషయమే.

అలాంటి పెద్ద రాష్ట్రంలో పోటీ చేసే స్థానాలు పరిమితంగా ఉంటే గెలిచే స్థానాలు సైతం తగ్గిపోతాయని భావిస్తోంది. అక్కడ ఏ పార్టీ బలం ఎంత అన్న విషయంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలో 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. ఎవరి బలం ఎంత అన్నది అంచనా వేయవచ్చు.

ఆ ఎన్నికల్లో మొత్తం 80 సీట్లకు ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ 78 చోట్ల పోటీ చేసి 62 గెలుచుకోగా, మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) 2 చోట్ల పోటీ చేసి ఆ రెండూ గెలుచుకుంది. మొత్తంగా కూటమి 64 సీట్లు గెలుచుకోగా.. ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) కలిసి ఒక కూటమిగా ఏర్పడి 78 స్థానాల్లో పోటీ చేశాయి. వాటిలో బీఎస్పీ 10, ఎస్పీ 5 సీట్లు గెలుచుకోగా ఆర్ఎల్డీ ఒక్కటి కూడా గెలవలేకపోయింది.

మొత్తంగా ఈ కూటమికి 15 సీట్లు వచ్చాయి. అప్పుడు ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 67 చోట్ల బరిలోకి దిగగా.. కేవలం సోనియా గాంధీ మాత్రమే గెలుపొందారు. ఆ ఎన్నికల్లో సోనియా, రాహుల్ పోటీ చేసిన రాయ్‌బరేలీ, అమేఠీ స్థానాల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థులను బరిలోకి దించకుండా సహకరించినప్పటికీ..రాహుల్ గాంధీ అమేఠీలో ఓడిపోయారు. ఇక ఓట్ల శాతం గణాంకాలను పరిశీలిస్తే.. ఎన్డీఏ కూటమి 50.76 శాతం ఓట్లు సాధించింది. ఈ లెక్కన రాష్ట్రంలోని మిగతా పార్టీలన్నీ కలిసి పోటీ చేసినా సరే.. ఎన్డీఏ కూటమిని ఢీకొట్టే పరిస్థితి లేదు. బీఎస్పీ-ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి సాధించిన ఓట్లశాతం 38.89 కాగా కాంగ్రెస్ 6.31 శాతం ఓట్లు సాధించింది.

ప్రస్తుతం మారిన పొత్తులు, కూటముల నేపథ్యంలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ విపక్ష కూటమికి దూరంగా ఉంది. దళిత, బహుజన వర్గాల్లో ఆ పార్టీకి నేటికీ బలమైన ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎస్పీ-ఆర్ఎల్డీతో కలిసి కూటమిగా పోటీ చేస్తోంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, రాష్ట్రంలో యోగీ సర్కారు పాలన వంటివి కమలనాథులకు మరింత అదనపు మార్కులు వేస్తున్నాయి. పదేళ్ల పాలన కారణంగా ఏర్పడే వ్యతిరేకతను అధిగమించేలా చేస్తున్నాయి.

పైగా వివిధ రకాల సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ సమాజ్‌వాదీకి బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న యాదవులను, బీఎస్పీ వెన్నెముకగా ఉన్న దళిత, బహుజనులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం ఎలాగూ చేస్తోంది. ముస్లింలు ఎన్నటికీ తమ ఓటుబ్యాంకు కాదు అనుకోకుండా.. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ఆ వర్గానికి పకడ్బందీగా అమలు చేస్తూ వారిని సైతం తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో.. విపక్ష కూటమి (ఇండియా) పొత్తులు ఈ రాష్ట్రంలో ఎంతమేర ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement