Friday, April 26, 2024

Delhi | బీజేపీ, టీఆర్‌ఎస్‌ల‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కౌంటర్ స్ట్రాటజీ.. ఢిల్లీ పర్యటనలో జగ్గారెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ఎదుర్కొనే వ్యూహాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఢిల్లీ వచ్చిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పరం దర్యాప్తు సంస్థలతో దాడులు చేసుకోవడం వల్లరాష్ట్రంలో ఆ రెండు పార్టీలే ఎక్కువ ఫోకస్ అవుతున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీలూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ స్థాయి నుంచి ఇస్తున్న సూచనల మేరకు రాష్ట్రంలో నడుచుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రతివ్యూహాలు రచించి బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నుంచే ఈ తరహా కౌంటర్ స్ట్రేటజీ అవసరమని తెలిపారు. ఇదే విషయంపై తమ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గేతో చర్చిస్తానన్నారు. కాంగ్రెస్‌లో అనైక్యత అనేది అందరికీ కనిపిస్తుందన్న ఆయన, మిగతా పార్టీల్లోనూ విబేధాలుంటాయి గానీ బయటకు రావని చెప్పారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి విబేధాల గురించి బహిరంగంగా మాట్లాడగల్గుతున్నామని తేల్చి చెప్పారు. మాట్లాడుకుని తమ సమస్యలు పరిష్కరించుకుంటున్నామని తెలిపారు. టీపీసీసీ కార్యవర్గం కూర్పు గురించి తాను మాట్లాడదల్చుకోలేదన్నారు. కార్యవర్గంలో ఎంతమందిని చేర్చుకున్నా ఇంకా డిమాండ్ ఉంటుందని వెల్లడించారు. తమ పార్టీలో నేతలకు కొదవలేదన్న ఆయన, అందుకే డిమాండ్ చేసి మరీ పదవులు అడుగుతుంటారని వివరించారు. పార్టీని ఎలా మెరుగుపర్చాలన్న అంశం మీదే తాను దృష్టి పెట్టానని చెప్పారు. ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్‌ను కలుస్తానని, సోనియా, ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్ కూడా కోరతానని జగ్గారెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement