Tuesday, April 30, 2024

Delhi | గనులు ఇవ్వలేమని చెబుతున్నారు.. సింగరేణికి గనుల కేటాయింపుపై టీఆర్ఎస్ ఎంపీల ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సింగరేణి పరిధిలోని నాలుగు కోల్ బ్లాక్‌లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని రామగుండంలో చెప్పిన ప్రధాని ఉద్దేశపూర్వకంగానే వేలం పేరుతో ఆ సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నామా ఆరోపించారు. కోల్ బ్లాకులు లేకుండా సింగరేణి ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 38 బ్లాకులను అమ్ముతున్నట్లు కేంద్రం చెబుతోందన్నారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటూ గనులు కూడా లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. సింగరేణిని తెలంగాణాకే వదిలేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం నహించదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యతిరేక విధానాలపై పార్లమెంట్‌లో నిలదీసి వారి వైఖరిని దేశమంతటికీ తెలియజేస్తామన్నారు. అనంతరం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… వేలాది మంది కార్మికుల బతుకుదెరువైన బొగ్గు గనులను వేలం వేయకుండా తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని గుర్తు చేశారు.

ఇప్పుడు 60 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న కంపెనీ వచ్చే సంవత్సరానికి 68 మిలియన్ టన్నులు టార్గెట్‌గా పెట్టుకుందని, రాష్ట్రానికి గనుల కేటాయింపు జరిగితే త్వరగా టార్గెట్ చేరుకునే అవకాశముందని చెప్పారు. 2015లో తెచ్చిన పాలసీ ప్రకారం కేంద్రం గనులను వేలం వెయ్యవచ్చు లేదా రాష్ట్రాలకు కేటాయించవచ్చు లేదా రిజర్వ్ చెయ్యవచ్చని తెలిపారు. కేంద్రం నాలుగు బ్లాక్స్ వేలంలో పెడితే ఒక్క కొయ్యగూడెం మాత్రమే అరబిందో కంపెనీకి ఇచ్చిందని, మిగిలిన మూడు బ్లాక్స్ ఎవరూ తీసుకోలేదని అన్నారు. గనులు వేలం వేసే సమయంలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకపోతే ఎలా అని రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. ఒక సంస్థ తర్వాత మరొకటి వేలం వేస్తే ఎలా ? వాటిపై ఆధారపడిన కార్మికుల భవిష్యత్ ఏంటని నిలదీశారు. పాలసీలోని 11(ఏ) కండిషన్ ప్రకారం తమకు నేరుగా కేటాయించాలని కోరామని రంజిత్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement