Sunday, April 28, 2024

వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

శ్రీకాకుళం : రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని, ఇది శుభపరిణామమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పాలకవర్గ సభ్యులు, బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2 వందల సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని, అన్ని బ్యాంకులు లాభాల బాటలో నడుస్తున్నామని ఇది శుభసూచికమని తెలిపారు. గతంలో సహకార బ్యాంకులు అప్పుల ఊబిలో ఉండేవని, వాటిని లాభాల బాటలో నడిపించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలిపారు. తద్వారా రూ.1800 కోట్ల ఆర్ధిక లావాదేవీలతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉందని, ఇతర వాణిజ్య బ్యాంకులకు ధీటుగా ఈ బ్యాంకు పని చేయడం ఆనందదాయకమన్నారు. 20 సంచార ఏటిఎంలతో, 25 బ్రాంచులతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పనిచేస్తుందని అన్నారు. లాభాపేక్షతో కాకుండా అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యాంగా సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని తెలిపారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా అన్నిరకాల లావాదేవీలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇది మన బ్యాంకు అనే భావనతో అధికారులు, సిబ్బంది పనిచేయాలని కోరుతూ సహకార బ్యాంకును ఈ స్థాయికి తీసుకువచ్చిన అధికారులను, సిబ్బందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల గురించి మంత్రి మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని, స్థానికంగా పండే పంటల ఆధారంగా ఆ యూనిట్ల స్థాపించేందుకు చర్యలు తీసుకోనున్నామని అన్నారు. ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకువస్తే వారికి ప్రభుత్వం తరపున అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. గతంలో రైతులకు ప్రభుత్వమే వ్యవసాయ యాంత్రీకరణపై సూచనలిస్తూ యాంత్రీకరణను నిర్ధేశించడం జరిగిందని, ప్రస్తుతం రైతు సంఘాలకు నచ్చిన వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను 40 శాతం రాయితీతో కొనుగోలు చేసుకునే స్వేచ్ఛను రైతులకు కల్పించడం జరిగిందని తెలిపారు. సున్నావడ్డీతో వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను కొనుగోలు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన సంగతిని మంత్రి గుర్తుచేసారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు మంత్రికి దుశ్శాలువ, జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. గత రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, ఆ యన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్ధవంతమైన పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు అన్నివిధాల కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలో రూ.1800 కోట్లతో ఇతర బ్యాంకులకు ధీటుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పనిచేస్తుందని అన్నారు. జిల్లావ్యాప్తంగా 25 సహకార బ్యాంకులు, 49 ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్తలు పనిచేస్తున్నాయని అన్ని లాభాల బాటలో నడుస్తున్నట్లు చెప్పారు. మరో 11 కొత్త బ్రాంచులను ఏర్పాటుచేసేందుకు స్థల సేకరణ చేయడం జరిగిందని, త్వరలో వాటిని కూడా వినియోగదారులకు అంకితం చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ ఛైర్ పర్సన్ సుగుణ, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ శిమ్మ నేతాజీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గ సభ్యులు మిరియాబెల్లి శ్యామసుందరరావు, బొడ్డేపల్లి నారాయణరావు, గొండు నిర్మల, దండాసి ఎండమ్మ, నడిమింటి రామ్మూర్తి, బంకి లక్ష్మణమూర్తి, ముఖ్యకార్యనిర్వహణాధికారి డి.వరప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి కె.శ్రీధర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement