Monday, May 6, 2024

సీఎం కేసీఆర్‌ ఒక విజన్‌తో పని చేస్తున్నారు : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ ప్రతినిధి, మే 6 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక రోల్‌ మోడల్‌గా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక విజన్‌తో పని చేస్తున్నారని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం దివ్యా ఆర్డెన్ లో నిర్వ‌హించారు. ఈ సమ్మేళనానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నిర్మ‌ల్ పుర వీధుల‌న్ని గులాబీమయంగా మారాయి. రాంనగర్ (16 వార్డు) కౌన్సిలర్ తారక వాణీ రఘువీర్ దంప‌తులు కాంగ్రెస్ పార్టీ వీడి త‌మ అనుచ‌రుల‌తో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారందరికీ బీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు సాగు, తాగునీళ్లు, కరెంటు లేక గోసపడ్డాం…పంటలు పండక,పండిన పంటను అమ్ముకోలేక ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాం. తెలంగాణ‌ రాష్ట్రం వచ్చాక వ్యవసాయంలో ప్రగతి సాధించాం. ఎండాకాలం వస్తే బోర్ కొట్టి ఇబ్బందుల పడేవారు… ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ ప‌రిశుద్ధ‌మైన నీటిని అందిస్తున్నాం. మహిళల ఓట్లు తప్ప కష్టాలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ మాత్రమే వారి క‌ష్టాల‌ను గుర్తించారు. కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తీసుకొచ్చి.. నేనున్నా అనే భరోసా సీఎం కేసీఆర్ కల్పించారు.

ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా, చేపలు, గొర్రెలు, దళిత బంధు, ఆసరా పింఛన్లు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ‌. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రిపై ప్రజల ఆశీర్వాదం ఉంద‌న్నారు. రాష్ట్రం ప్ర‌భుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయ‌ని, పార్టీ నాయకులు కార్యకర్తలు వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తున్నద‌ని, చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు సహకరించాల్సింది పోయి ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. తొమ్మిది ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించారని, మ‌న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వ‌డం లేద‌ని కేంద్ర వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో రాష్ట్రంపై చిన్న చూపును చూపిస్తున్నదన్న విషయాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణుల‌కు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement