Friday, May 3, 2024

ఆర్టీసీ ఉద్యోగులకు జీతాల పెంపు!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులపై ఇటీవలే వరాల జల్లును కురిపించిన సీఎం కేసీఆర్..తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను కూడా పెంచుతామని అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆర్టీసీని కాపాడుకుంటున్నామన్నారు. బడ్జెట్‌లో మూడు వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. ప్రతి నెలా నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ జీతాలు పెరిగాయని, తమకు పెంచాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారని చెప్పారు. రవాణాశాఖ మంత్రితో మాట్లాడి త్వరలోనే వేతనాలను పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.  తెలంగాణలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్య‌మం సమయంలో తెలంగాణ కోసం పోరాటం చేశాయని సీఎం తెలిపారు. ఆ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మ‌ర‌వ‌లేనిదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు భ‌య‌ప‌డాల్సిన అవ‌సరం లేదని ఆర్టీసీని కాపాడుటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కాగా, తెలంగాణలో దాదాపు ఉద్యోగులందరి జీతాలను పెంచింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ 30శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచే ఇది అమల్లోకి రానుంది. అంతేకాదు ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా 61 ఏళ్లకు పెంచారు. ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులందరికీ జీతాలు పెంచుతున్నట్లు వెల్లడించారు. మొత్తం 9.17 లక్షల మంది ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  

Advertisement

తాజా వార్తలు

Advertisement