Monday, April 29, 2024

నీటి యుద్ధం అంటూ కేసీఆర్ మరో డ్రామా: భట్టి విక్రమార్క

తెలంగాణ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణను కాపాడేందుకు నీటి యుద్ధం చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్, మంత్రులు కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. సంగమేశ్వర ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది క్రితమే జీవో జారీ చేసిందని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా రోజుకు మూడు టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి రోజుకు 80 వేల క్యూసెక్కుల నీళ్లు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఈ మొత్తం మీద రోజుకు 11 టీఎంసీల నీటిని తీసుకునిపోతున్నారని తెలిపారు.

తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసమని.. కానీ ప్రభుత్వం నిద్రపోతుంటే నిద్రలేవమని, పోరాటం చేయాలని మొత్తుకున్నా వినిపించుకోలేదని మండిపడ్డారు. దొంగలు పడ్డ ఆరు నెలకు కుక్కలు మోరిగినట్లు.. కుక్కలైనా ఆరునెల్లకు మోరుగుతాయి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం, నేతలు ఏడాదికి మేలుకున్నారని ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు నష్టం వస్తుందని కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీలు చెప్పాయని.. నీటి మీద, నదులు మీద అవగాహన ఉన్న మేధావులంతా చెప్పారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఊర్లలో తిరుగుతూ తుపాకీ రామునిలా ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స ధరలపై నియంత్రణ లేదని ఆయన ఆరోపించారు. సీఎం ట్రీట్‌మెంట్ తీసుకునే ఆస్పత్రి కోవిడ్ చికిత్సకు లక్షలు ఎలా వసూలు చేస్తోందని విక్రమార్క ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement