Friday, April 26, 2024

‘చింగారీ’ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్

దేశీయ వీడియో షేరింగ్‌ యాప్‌ చింగారీకి ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. తమ సంస్థలో ఓ వాటాదారుగా సల్మాన్ బోర్డులోనూ చేరినట్లు చింగారీ వెల్లడించింది. సల్మాన్‌ చేరికపై చింగారీ సహవ్యవస్థాపకులు, సీఈఓ సుమిత్‌ ఘోష్‌ హర్షం వ్యక్తం చేశారు. చింగారీ భారత్‌లోని ప్రతి మూలకు చేరేందుకు సల్మాన్ భాగస్వామ్యం తోడ్పనుందని అభిప్రాయపడ్డారు. అటు హీరో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. చింగారీ సంస్థ తన వినియోగదారులకు కొత్త అనుభూతి ఇస్తుందని హామీ ఇచ్చారు. అతి తక్కువ సమయంలో చింగారీకి లభించిన ఆదరణ తనను ఆకట్టుకుందన్నారు. సిటీల నుంచి గ్రామాల వరకు లక్షల మంది ప్రతిభను బయటకు తీసుకువచ్చేలా చింగారీ యాప్ కృషి చేస్తోందని సల్మాన్ ప్రశంసలు కురిపించారు.

కాగా దేశీయ వీడియో షేరింగ్ యాప్ చింగారీ ‘టిక్ టాక్’ నిషేధం కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో గత ఆరునెలల కాలంలో చింగారీ సంస్థలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆన్‌మొబైల్ గ్లోబల్, రిపబ్లిక్ ల్యాబ్స్ యూఎస్, ఆస్టార్క్ వెంచర్స్, వైట్ స్టార్ క్యాపిటల్, ఇండియా టీవీ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. చింగారీ వినియోగదారుల సంఖ్య త్వరలోనే 56 మిలియన్‌ల నుంచి 100 మిలియన్‌లకు చేరుతుందని ఆన్‌మొబైల్ గ్లోబల్ సంస్థ అభిప్రాయపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement