Thursday, May 2, 2024

వైరల్‌ ఫీవర్స్‌ బారిన చిన్నారులు… ఆసుపత్రుల్లో రోజు రోజుకూ పెరుగుతున్న బాధితుల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ ఏడాది వర్షాకాలంలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతోపాటు గతేడాదికంటే ఎక్కువగా ఈ ఏడాది విషజ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు ఇంటికొకరు మంచం పట్టారు. అయితే ఈ ఏడాది ఎక్కువగా చిన్న పిల్లలు వైరల్‌ ఫీవర్స్‌ బారిన పడుతున్నారు. డెంగీ, టైఫాయిడ్‌ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఓపీ తీసుకున్నా, అడ్మిట్‌ అవుతున్న కేసులను పరిశీలించినా డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ తదితర విష జ్వరాలతో బాధపడుతున్న చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు.
జ్వరం లక్షణాలతో ఓపీకి వస్తున్న పిల్లల్లో చాలా మంది రెండు రోజుల్లోనే తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, దాంతో వారి ని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందించాల్సిన పరిస్తితులు అనివార్యమవుతున్నాయని ప్రభుత్వ, ప్రయివేటు వైద్యులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున చిన్నారులు జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులతో బాధపడుతున్న చిన్నారులను తీసుకుని ప్రతీ రోజూ పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఇంట్లో చిన్నారులతో ప్రారంభమవుతున్న విష జ్వరాలు ఇంటిల్లిపాదికి వ్యాపిస్తున్నాయి.

డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. పాఠశాలకు వెళుతున్న చిన్నారులు అక్కడ దోమకాటుకు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాలల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా యాజమాన్యాలపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది చిన్నారుల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయాల్సిన పరిస్తితులు నెలకొన్నాయి. కరోనా తర్వాత పాఠశాలలు మూతపడడంతో దాదాపు రెండున్నరేళ్లుగా పిల్లలు బయటి వాతావరణానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలలకు వెళుతున్న చిన్నారులు దోమలు, పరిసరాల్లో నెలకొన్న అపరిశుభ్రతతో వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇంట్లో డెంగీ ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ ఇతర కుటుంబ సభ్యులను కుట్టినా డెంగీ వ్యాపించే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చిన్నారులు అనారోగ్యానికి గురైన మొదట్లో సాధారణ జ్వరంగానే భావిస్తున్న తల్లిదండ్రులు డోలో, కాల్‌పాల్‌ మాత్రలతో సరిపెడుతున్నారు. ఈలో గా రెండు మూడు రోజులు గడుస్తుండడం వాంతులు, విరేచనాలతోపాటు తీవ్ర జ్వరం బారిన చిన్నారులు పడుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఆసుపత్రులకు వచ్చిన చిన్నారులకు అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందించాల్సిన పరిస్థితులు అనివార్యమవుతున్నాయి. రోజూ ప్రతీ ఆసుపత్రిలో ఓపీలోనూ విషజ్వరాలతో బాధపడుతున్న కనీసం 70 నుంచి 80 మంది చిన్నారులకు చికిత్స పొందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌ నగరాన్నే తీసుకుంటే గతేడాదిలో మొత్తం 1559 డెంగీ కేసులు నమోదవగా ఈ ఏడాది ఆ సంఖ్య మూడు రెట్లకు పైగా ఉండొచ్చని వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. గతేడాది హై-దరాబాద్‌లో జులై నెలాఖరు వరకు 130 డెంగీ కేసులు నమోదు కాగా… ఈ ఏడాది ఇప్పటికే 596 కేసులు నమోదయ్యాయి. అయితే… హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ, ఇతర విష జ్వరాల కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. జిల్లా మలేరియా అధికారుల లెక్కలకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. దీంతో అధికారులు లైట్‌ తీసుకుంటుండడంతో ఇంట్లో ఒకరితో మొదలైన జ్వరం… మిగతా కుటుంబ సభ్యులందరినీ పాకుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement