Thursday, May 16, 2024

Delhi | ఓరుగల్లు బాలికకు బాల పురస్కారం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాకతీయుల రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్)కు కళలకు కాణాచిగా పేరు. ఆ నగరానికి చెందిన 10వ తరగతి బాలిక పెండ్యాల లక్ష్మీప్రియ కూచిపూడి నృత్యంతో యావద్దేశాన్ని ఆకట్టుకుంటోంది. ఈ నెల 22న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ బాలల పురస్కారం అందుకున్న లక్ష్మీప్రియ మర్నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసింది. చిన్న వయస్సులోనే కూచిపూడి నృత్యం అభ్యసించడం ప్రారంభించిన లక్ష్మీప్రియ, గత ఏడాది జరిగిన కళా ఉత్సవ్‌లో అనేక శాస్త్రీయ నృత్య ప్రదర్శనలను కాదని కూచిపూడికి మొదటి స్థానం దక్కించేలా చేయగలిగింది.

కూచిపూడితో పాటు మోహినిఅట్టంలోనూ ప్రతిభను కనబరుస్తూ ‘లాస్యప్రియ’ బిరుదు అందుకుంది లక్ష్మీప్రియ. భారత గణతంత్ర వేడుకల్లో భాగంగా శుక్రవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరగనున్న పరేడ్‌లో బాల పురస్కారం విజేతలతో పాటు పాల్గొననుంది. వరంగల్ నగరంలోని హన్మకొండ ప్రాంతానికి చెందిన దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పెండ్యాల రాకేశ్ కుమార్, సాయిలత దంపతుల కుమార్తె లక్ష్మీప్రియ ప్రస్తుతం కాజీపేటలోని మోంట్‌ఫోర్ట్ స్కూల్‌లో 10వ తరగతి చదువుకుంటోంది.

ఏడేళ్ల క్రితం కూచిపూడి గురువు బి. సుధీర్ రావు వద్ద నాట్యాభ్యాసం ప్రారంభించిన లక్ష్మీప్రియ ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు, రికార్డులు సొంతం చేసుకుంది. 2020లో ఆర్ట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ ఆ బాలిక చోటు సంపాదించింది. అలాగే గత ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో పాల్గొని ప్రధానితో మాట్లాడ్డమే కాదు, ఆయన ముందు 2 నిమిషాల పాటు కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది.

తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొంత ప్రోత్సాహం అందిస్తూ కళా ప్రదర్శనకు తగిన వేదికను అందజేస్తే రాష్ట్రం పేరు నిలబెట్టేలా ప్రతిభ చాటుతానని చెబుతోంది. గురువారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడిన లక్ష్మీప్రియ.. తల్లిదండ్రులు, గురువుతో పాటు తాను చదువుకుంటున్న పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహంతోనే బాలపురస్కారం స్థాయికి ఎదిగానని తెలిపింది. హైందవ సంస్కృతి, సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించేలా తాను కృషి చేస్తానని వెల్లడించింది.

- Advertisement -

చేయూతనివ్వాలి: సుధీర్ రావు

కళా ప్రదర్శనలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని లక్ష్మీప్రియకు కూచిపూడి గురువుగా ఉన్న బి. సుధీర్ రావు తెలిపారు. నేటి యుగంలో కళాకారులు కళతో పాటు విద్యాభ్యాసం కూడా కొనసాగించక తప్పదని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలని అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుంచి ప్రోత్సాహం ఉందని, అయితే ఆర్థిక చేయూత కూడా అందిస్తే ఇలాంటి కళాకారులను మరింతమందిని తయారు చేయడానికి వీలుంటుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement