Friday, April 26, 2024

డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధనల్లో మార్పులు.. ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకి తీసుకొచ్చిన రవాణా శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ శుభవార్త చెప్పంది. టూ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ కలిగిన వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిసినప్పటికీ సులభంగా పొందే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిసిన వాహనదారులు ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి లైసెన్సుల కోసం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే వారు. ఈ విధానానికి చెక్‌ పెడుతూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్‌లైన్‌లోనే పునరుద్ధరించుకునే వీలు కల్పించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ డూప్లికేషన్‌, లేదా రెన్యువల్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ టూ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనదారునికీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి.

రవాణా శాఖ అధికారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరు చేసే సమయంలోనే వ్యాలిడిటీ టైమ్‌ ఇస్తారు. ఆ సమయం ముగిస్తే మళ్లి దాన్ని రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిసినప్పటికీ రెన్యువల్‌ చేసుకోకుండా వాహనం నడిపితే ట్రాఫిక్‌ పోలీసులు భారీ మొత్తంలో చలానా రూపంలో పెనాల్టి విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిసిన వాహనదారులు రెన్యువల్‌ కోసం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో ఇదే అదనుగా బ్రోకర్లు, కమిషన్‌ ఏజెంట్లు వాహనదారుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు నకిలీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ల సమస్య ఏర్పడింది. .

దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున నష్టం వాటిల్లుతోంది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌ మోడ్‌ను ప్రవేశపెట్టడానికి ముందు గడువు తీరిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సంబంధిత ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అయితే, గడువు ముగిసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న వారి జరిమానా మొత్తాన్ని రవాణా శాఖ భారీగా పెంచింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ సకాలంలో పునరుద్ధరించుకోని పక్షంలో డిఫాల్టర్లు ఏడాదికి పెనాల్టి రూపంలో రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement