Thursday, October 31, 2024

ISRO | లాంచ్ కి సిద్దంగా చంద్రయాన్‌-3.. త్వ‌ర‌లో తేదీని ప్రకటిస్తాం : సోమనాథ్‌

భారత్ చేపట్టనున్న మరో ప్రతిష్టాత్మక మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 లాంచ్‌కు సిద్ధమైనట్లు ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు. జూలై 12-19 మధ్య శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగిస్తున్న‌ట్టు ఇవ్వాల (బుధవారం) సోమనాథ్‌ వెల్ల‌డించారు. ప్రస్తుతం చంద్రయాన్-3 ని స్పేస్‌క్రాఫ్ట్‌కు పూర్తిగా అనుసంధానం చేసి పరీక్షలను కూడా పూర్తి చేశాం. జూలై 12 నుంచి 19 మధ్య ప్రయోగానికి అవకాశం ఉంది. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత ఖచ్చితమైన తేదీని ప్రకటిస్తామని సోమనాథ్ తెలిపారు. అలాగే అన్ని పరిస్థితులు అనుకూలిస్తే జూలై 13 మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రయాన్‌-3 నింగిలోకి వెళ్తుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.

కాగా, చంద్రయాన్-3 మిషన్‌ను అత్యంత బరువైన రాకెట్‌, జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ మార్క్-III ద్వారా ప్రయోగించనున్నారు. స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్ (LM), ప్రొపల్షన్ మాడ్యూల్ (PM)తోపాటు చంద్రుడిపైకి దించే రోవర్‌ను పంపుతారు. 2019లో చేపట్టిన చంద్రయాన్‌-2 మిషన్‌లో చంద్రుడి ఉపరితలంపై రోవర్‌ క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత రూ.615 కోట్ల వ్యయంతో చేపడుతున్న చంద్రయాన్‌-3 మిషన్‌ ద్వారా చంద్రుడిపై రోవర్‌ను సురక్షితంగా ల్యాండ్‌ చేయనున్నారు. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పలు పరిశోధనలు చేపట్టనున్నారు. తద్వారా ఈ ఘనత సాధించిన నాల్గవ దేశంగా భారత్‌ నిలువనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement