Monday, April 29, 2024

Delhi | హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైల్.. ప్రాజెక్టు సర్వేకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్రం మరో అడుగు ముందుకేసింది. ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు ఆమోదముద్ర వేసింది. బుధవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. దీనికోసం కేంద్రం 14 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఓవైపు రీజనల్ రింగ్ రోడ్డు, మరోవైపు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు ఈ రెండు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల మూలంగా హైదరాబాద్ నగరంతో పాటు, నగరం చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజ సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో స్పష్టమైన మార్పులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నలువైపుల ఉన్న రైల్వే లైన్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రజారవాణాతో పాటుగా వస్తువుల రవాణా కూడా పెరిగి, వ్యాపారపరంగా గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టుక్కల వచ్చే పరిశ్రమలు, మాల్స్, వినోద కేంద్రాలు, శాటిలైట్ టౌన్స్ మొదలైన వాటి ద్వారా లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని… దీనిద్వారా విద్య, వ్యాపారం, ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున పెరగటంతో పాటు మెడికల్ సౌకర్యాలు కూడా సమయానికి అందుబాటులో ఉంటాయని అన్నారు.

- Advertisement -

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు చాలా కీలకంగా మారనుందని కిషన్‌రెడ్డి వివరించారు. కరీంనగర్ – హసన్‌పర్తి మధ్య 61 కిలోమీటర్ల రైల్వే లైన్‌ సర్వే కోసం కోటిన్నర రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ పనులను సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.330 కోట్లతో చేపట్టనున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం మూడింట రెండొంతుల ఖర్చును (2/3) రాష్ట్రం భరించాల్సిన ఉన్నా, అక్కడి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో మొత్తం ఖర్చును కేంద్రమే భరించనున్నట్టు తెలిపారు.

రాష్ట్రాల్లో జరిగే అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మూలధన వ్యయాలకు సమయానుగుణంగా మరింత సహకారాన్ని అందించేందుకు 2020-21లో కేంద్రం ప్రారంభించిన ‘రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సహాయ పథకం’లో భాగంగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.2,102 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని ఆయన చెప్పారు. కరోనా కారణంగా రాష్ట్రాలకు జరిగిన నష్టం నుంచి కొంతమేరకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలకు 50 సంవత్సరాలకుగానూ వడ్డీ లేని రుణంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.

ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2020-21 నుంచి 2023-24 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.5,221.92 కోట్లు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన వివిధ పథకాలను/కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయటానికి, అభివృద్ధి చెందుతున్న వ్యాధుల నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహకారాన్ని అందించటానికి వీలుగా అత్యాధునిక వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో కూడిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయటానికి గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డిగుర్తు చేశారు.

ఇటీవలే గోవాలో ముగిసిన జీ20 పర్యాటక మంత్రుల స్థాయి సమావేశాలు విజయవంతమయ్యాయని, గోవా రోడ్ మ్యాప్ ద్వారా ప్రపంచ పర్యాటక రంగాభివృద్ధితో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని ఆయన పేర్కొన్నారు. భారత పర్యాటకాన్నిసరికొత్త పుంతలు తొక్కించేందుకు సెప్టెంబర్‌లో ఢిల్లీలో గ్లోబల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

నాయకత్వ మార్పుపై చర్చ లేదు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ నాయకత్వంలో మార్పులు చేర్పులపై వస్తున్న కథనాలు, ఊహాగానాల గురించి కిషన్ రెడ్డిని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటి చర్చ ఏదీ పార్టీలో జరగలేదని అన్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కర్ణాటకతో పాటు తెలంగాణ, ఒడిశా సహా మరికొన్ని రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుపై బీజేపీ అధిష్టానంలో కసరత్తు చేస్తోందని, అందులో భాగంగా తెలంగాణలో అధ్యక్ష బాధ్యతల్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగిస్తారని కథనాలు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షులు బండి సంజయ్‌కు, ఇతర పార్టీల నుంచి చేరిన కీలక నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటివారికి మధ్య పొసగకపోవడం కారణంగా తలెత్తిన వర్గపోరు సమస్యను పరిష్కరించేందుకు పాత – కొత్త నేతలకు ఆమోదయోగ్యంగా ఉండే కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నారని విశ్లేషణలు వచ్చాయి.

కొద్ది రోజుల క్రితం అసంతృప్త నేతలు ఈటల, రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హుటాహుటిన ఢిల్లీకి పిలిపించి చర్చించడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని, ఈటల రాజేందర్‌కు ప్రచార కమిటీ సారధిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తారని కూడా చర్చ జరిగింది. వీటి గురించి కిషన్ రెడ్డిని ప్రశ్నించగా.. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement