Saturday, May 4, 2024

పెట్రో, డీజిల్‌ ధరలపై సెస్సును తక్షణమే రద్దు చేయాలి.. లారీ డ్రైవర్లు, యజమానుల సమ్మేళనంలో మంత్రి కేటీఆర్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పెట్రోల్‌, డీజిల్‌,గ్యాస్‌ ధరలను పెంచడం ద్వారా పేద, సామాన్యుల నుంచి కేంద్ర ప్రభుత్వం రూ.30లక్షల కోట్లను దోచుకుందని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం విధించిన సెస్సు ను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్‌ పేరుతో అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఆయిల్‌ కంపెనీలకు రాయితీ ఇస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం..పేద, సామాన్యులు వినియోగించే డొమాస్టిక్‌ సిలిండర్‌పై సబ్సీడీ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో లారీ యజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్‌, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… 2014లో మోడీ ప్రధాని అయినప్పుడు ప్రపంచ విపణిలో క్రూడాయిల్‌ ధర 94 డాలర్లు అని , ఇప్పుడు కూడా క్రూడాయిల్‌ ధర 98 డాలర్లుగానే ఉందని వివరించారు. క్రూడాయిల్‌ ధర పెద్దగా పెరగనపుడు మోడీ హయాంలో దేశంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.70 నుంచి రూ.112కు ఎందుకు చేరిందని ప్రశ్నించారు. రాష్ట్రాలేమైనా పన్నులు పెంచాయా..? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ముడి చమురు ధర పెరగలేదు కాని, మోడీ చమురు ధర పెరుగుతోందని ఎద్దేవా చేశారు.

- Advertisement -

పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం దోచుకున్నది ఇక చాలని, ఇకనైనా ధరలు తగ్గించి పేద, సామాన్యులపై పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లీటరు పెట్రోల్‌ రూ.70, డీజిల్‌ రూ.65కే ఇవ్వాలని మోడీ సర్కారును డిమాండ్‌ చేశారు. మోడీ సర్కారుకు సరుకు లేదని, ప్రజల సమస్యలపై సోయి లేదని మండిపడ్డారు. కేంద్రాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహి అనే ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేట్‌ పెద్దలకు కేంద్రం రూ.11.5 లక్షల కోట్లు మాఫీ చేసిందని గుర్తు చేశారు. సామాన్యులకు ఉచితాలు ఇవ్వకూడదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం… కార్పోరేట్‌ పెద్దలకు లక్షలకోట్ల రుణాలను మాఫీ చేస్తోందని ధ్వజమెత్తారు. పేదల విషయానికి వచ్చే సరికి మోకాలడ్డుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కుల, మతాల తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం… జనహితమే మా అభిమతం అని ప్రకటించారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు ఎనిమిదేళ్ల క్రితం కేసీఆర్‌ చెప్పింది ఒక్కటేనని, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తేనే ప్రజాప్రతినిధులుగా మన జన్మ ధన్యమవుతుందని చెప్పారు.

గడిచిన ఎనిమిదేళ్లుగా ఒకే మాట మీద అందరం నడుస్తున్నామన్న కేటీఆర్‌… రాష్ట్రంలో ఈ రోజున కరెంటు కోసం తిప్పలు లేవని, విద్యుత్‌ లేక ఆగమాగం అయిపోయిన పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహ వినియోగానికి నాణ్యమైన 24 గంటల కరెంటు ఇస్తున్నామని గుర్తు చేశారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తేల్చి చెప్పారు. ఫ్లోరైడ్‌ సమస్యను రూపుమాపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతోందన్నారు. మిషన్‌ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నామని, నేడు మూడున్నరకోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. కాళేశ్వరం కట్టామని, పాలమూరు పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఇవాళ మూడున్నర కోట్ల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని, ఇది కదా తెలంగాన దమ్ము అని వ్యాఖ్యానించారు. కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వ లేకపోతోందని విమర్శించారు. తెలంగాణలో నేడు దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలవుతున్నాయని, పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తల నుంచి మొదలుకుని కార్మికులు, శ్రామికుల బాగోగులు చూస్తున్నామని చెప్పారు.

నాడు ఉద్యమ సమయంలో మీకు తెలంగాణ వస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దమ్మున్న నాయకత్వం ఉందా..? అని అడిగేవారని, కాని నేడు ప్రపంచంలో ఉన్న నగరాలను దాటుకుని, హైదరాబాద్‌ వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డు పొందిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డు రావడ మే మన దమ్ము అని, సీఎం కేసీఆర్‌ నాయకత్వ పటిమకు అవార్డు నిదర్శనమన్నారు. నూకలు తినండని అనడం ద్వారా తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి బియ్యం కొనుగోళ్లకు మోడీ ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. తెలంగాణను అవమానించిన బీజేపీ నేతల తోకలు కత్తిరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నూకలు తినండని అవమానించిన భాజాపాకు ఓటు వేయాలా..? అనేది ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement