Tuesday, May 7, 2024

వాహనదారులపై కేంద్రం టోల్‌ బాంబు.. 5 నుంచి 10 శాతం పెంచుతున్నట్లు ప్రకటన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పెట్రోల్‌ డీజిల్‌పై సెస్‌ వసూలు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో భారీ వడ్డనకు సిద్ధమైంది. టోల్‌ టాక్స్‌ల పెంపు పేరుతో వాహనదారుల జేబులు గుల్ల చేయనుంది. ప్రతీ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్‌ చార్జీల సమీక్షలో భాగంగా ఈ ఏడాది 5 నుంచి 10 శాతం వరకు పెంచుతున్నట్లు జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకటించింది. పెరిగిన చార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. దీంతో జాతీయ రహదారులపై తిరిగి అన్ని రకాల వాహనదారులు (ద్విచక్ర వాహనాలు మినహా) అదనంగా రూ.10 నుంచి 60 వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరిగిన టోల్‌ చార్జీల వల్ల కార్లు, జీపులకు రూ.5 నుంచి రూ.10, బస్సులు, లారీలకు రూ.15 నుంచి రూ.25, భారీ వాహనదారులు రూ.40 నుంచి రూ.50 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక సింగిల్‌, డబుల్‌ ట్రిప్‌లతో పాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉండనుంది. ఏప్రిల్‌ 1 నుంచి తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఎన్‌హెచ్‌ఏఐకి సంబంధించిన 32 టోల్‌ గేట్లు ఉన్నాయి.

- Advertisement -

తెలంగాణలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ, బెంగళూరు, డిండి, యాదాద్రి, వరంగల్‌, భూపాలపట్నం, నాగ్‌పూర్‌, పూణే తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారులు ఉన్నాయి. అలాగే, తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్ర్రాలకు పది జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ, బెంగళూరు, వరంగల్‌ మార్గాలలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. కొత్తగా పెంచిన చార్జీల ప్రకారం కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే టాక్స్‌ భారీగా పెరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఎన్‌హెచ్‌ 65 మీదుగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లిరావడానికి భారీ మొత్తంలో టోల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ హైవేపై వాహనదారులు రూ.465 చెల్లిస్తున్నారు. ఏప్రిల్‌1 నుంచి పెరగనున్న చార్జీల ప్రకారం వాహనదారులు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.

అంటే మొత్తంగా రూ.490 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూట్‌లో పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు టోల్‌ ప్లాజాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ హైవేపై ఒకవైపు ప్రయాణానికి రూ.310 చెల్లిస్తుండగా, ఇకపై రూ.325 చెల్లించాలి. మినీ బస్సులు, లైట్‌ మోటార్‌, వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు, భారీ, అతి భారీ వాహనాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తానికి అదనంగా 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, 2014లో కేంద్ర ప్రభుత్వం టోల్‌ టాక్స్‌ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రూ.600 కోట్లు వసూలు చేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1824 కోట్లు వసూలు చేశారు. కేవలం 9 ఏళ్ల కాలంలో టోల్‌ టాక్స్‌ వసూలు 300 పెంచింది. దీంతో ట్రక్కుల ద్వారా సరఫరా చేసే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement