Monday, May 20, 2024

Delhi | ఏపీలో మద్యపానంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి : బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న మద్యపాన విధానంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో గురువారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన జయప్రకాశ్ ప్రతి రోజూ రాష్ట్రంలో 85 లక్షల మంది మద్యం తీసుకుంటున్నారని, ఆ లెక్కన ఏడాదికి రూ. 62వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రావాల్సి ఉంటుందని అన్నారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం లెక్కల్లో కేవలం రూ. 26 వేల కోట్లు మాత్రమే చూపుతోందని, మిగతా డబ్బంతా ఎటు వెళ్తుందో తెలియాలంటే దర్యాప్తు జరిపించాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన తీరును మాత్రమే తాము తప్పుబట్టామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసిన సమయంలో దర్యాప్తు సంస్థ ముందుగా పిలిపించి విచారణ జరిపిందని, ఆ తర్వాతే అరెస్టు చేసిందని గుర్తుచేశారు. జగన్ అరెస్టు నిబంధనలకు విరుద్ధంగా జరగలేదని అన్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు.

మహిళా బిల్లు సువర్ణాధ్యాయం

పార్లమెంటులో మహిళా బిల్లు గురించి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖితమైందని వల్లూరు జయప్రకాశ్ నారాయణ అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని, 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయాల కోసం పెండింగులో పెడుతూ వచ్చారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, మహిళా రిజర్వేషన్ల బిల్లు వంటి సాహసోపేత చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని అభివర్ణించారు.

చెప్పినవి అమలు చేసి తీరే ప్రభుత్వం తమదని, మహిళలు, బాలికల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని వెల్లడించారు. మోదీ నాయకత్వంలో మహిళలకు సమానావకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మహిళలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు కేవలం ఒకరికి మాత్రమే ఇస్తానంటూ మోసగిస్తున్నారని ఆరోపించారు. మహిళలపై గౌరవం లేని పార్టీ మజ్లిస్ అని, అందుకే లోక్‌సభలో బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేసిందని జయప్రకాశ్ అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement