Tuesday, October 8, 2024

తెలంగాణలో కేన్సర్‌ కేసులు రెట్టింపు.. మున్ముందు మరింత కష్టాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో రానున్న ఐదేళ్లలో కేన్సర్‌ కేసులు రెట్టింపు కానున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. వచ్చే ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్ర క్యాన్సర్‌ భారం 12.5 శాతం పెరిగే అవకాశం ఉందని తేలింది. తెలంగాణ రాష్ట్ర క్యాన్సర్‌ ఫ్యాక్ట్‌ షీట్‌ ఆధారంగా నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. మితిమీరిన పొగాకు వినియోగం కారణంగా 2025 నాటికి తెలంగాణలో కొత్త క్యాన్సర్‌ కేసులు ఏటా 53,565మేర పెరుగుతాయని రిపోర్టు హెచ్చరించింది. ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దూమపానం, గుట్కా, పొగాకు ఉత్పత్తుల నమలడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని ఆ నివేదిక సూచించింది. దూమ పాణం కారణంగా నోటి క్యాన్సర్‌ బారిన పడుతున్న యువత సంఖ్య రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సరదాగా మొదలై ప్రాణాలు తీస్తున్న ధూమపానం..

సరదాగా ఒకసారి మొదలైన ధూమపానం వ్యసనంగా మారి ఎందరో జీవితాలనో బలితీసు కుంటోంది. డ బ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం పొగాకు ఉత్పత్తుల వాడకం ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మందిని చంపుతోంది. భూమి మీద పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తోంది. పొగాకు సాగు, ఉత్పత్తి, పంపిణీ, వినియోగం.. దాని తర్వాత వస్తున్న వ్యర్థాల ద్వారా మానవ ఆరోగ్యానికి తీవ్రమైన హానికలుగుతోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ అనే వ్యాధి దేశంలో రోజురోజుకూ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోంది. పొగాకు వాడకం ఇదే విధంగా కొనసాగితే.. వచ్చే ఐదు సంవత్సరాలలో ఏటా లక్ష కంటే ఎక్కువ కొత్త ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులు నమోదవుతాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులకు 90శాతం కారణం సిగరెట్‌ తాగడమేనని సర్వేల్లో స్పష్టమైంది. భారతదేశంలో దాదాపు 10 నుంచి 15 శాతం మంది ప్రజలు పొగాకుకు బానిసలుగా మారుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దేశ జనాభాలో 15 ఏళ్లకు పైబడిన వారిలో 28.6 శాతం మంది ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని అందులో పురుషులు 42.4 శాతం, మ#హళలు 14.2 శాతం మంది ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

ధూమపానాన్ని మానేస్తే కలిగే లాభాలు ఎన్నో..

ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా దూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని మానివేయాలని రెనోవా సౌమ్య క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యులు సూచిస్తున్నారు. ధూమపానాన్ని మానెయడం కారణంగా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తగ్గడంతో పాటు షుగర్‌ వ్యాధి ముప్పు కూడా చాలా వరకు తొలగిపోతుందన్నారు. పొగ తాగడం మానేసిన వారి రక్తనాళాలు చురుగ్గా పని చేస్తాయని, గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతాయని వైద్యులు సూచిస్తున్నారు. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని మానేస్తే శరీర వ్యాధి నిరోధకశక్తి పెరుగడంతోపాటు అందం వికసిస్తుందని, కుటుంబ, సంసార సంబంధాలు బలపడతాయని, మానసిక చురుకుదనం ఉంటుందన్నారు. ధూమపానం మానేసిన 20 నిమిషాల్లోపే రక్తపోటు, గుండె కొట్టుకోవడం లాంటివి సాధారణ స్థితిలోకి వస్తాయని రెనోవా వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement