Monday, September 25, 2023

రామయ్య గారు ఎలా ఉన్నారు ?.. వనజీవి రామయ్యకు ఎంపీ సంతోష్ కుమార్ పరామర్శ

ఖమ్మం : “రామయ్య గారు ఎలా ఉన్నారు ? మీ ఆరోగ్యం ఎలా ఉంది ? మీ ఆరోగ్య పరిస్థితిపై సిఎం గారు వాకబు చేశారు. మీరు త్వరగా కోలుకోవాలి” అంటూ వనజీవి రామయ్యతో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ వీడియో కాల్ ద్వారా సంభాషించారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో వనజీవి రామయ్య చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఏవో డాక్టర్ కె రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినిపల్లి సంతోష్ కుమార్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ఫోన్ కి వీడియో కాల్ చేశారు.

- Advertisement -
   

ఈ సందర్భంగా వనజీవి రామయ్య తో సంభాషించారు. ఆరోగ్యం ఎలా ఉంది?, గాయాలు మానాయా? వైద్యులు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? అంటూ పలు విషయాలపై ఆరా తీశారు. మీ ఆరోగ్యం గురించి సీఎం కేసీఆర్ గారు కూడా వాకబు చేశారు అంటూ వనజీవి రామయ్య కు ఎంపీ సంతోష్ కుమార్ గుర్తు చేశారు. పూర్తిగా కోలుకున్నాక వ్యక్తిగతంగా వచ్చి కలుస్తాను అని ఆయనకు హామీ ఇచ్చారు. అనంతరం వనజీవి రామయ్య మాట్లాడుతూ ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించడం వల్లే తాను కోలుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్య కు అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్ కే రాజశేఖర్ గౌడ్ ని ఎంపీ సంతోష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement