Saturday, May 4, 2024

Delhi | బోన‌మెత్తిన ఢిల్లీ.. తెలంగాణ భవన్‌లో ఘనంగా సంబురాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాలు ఉత్సవాలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన లాల్ దర్వాజా సింహవాహిన అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంబరాల్లో పాల్గొని బోనం ఎత్తుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథ్, ఎంపీలు కె.ఆర్ సురేష్ రెడ్డి, బోర్లకుంట వెంకటేష్ నేత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ భవన్ పరిసరాల్లో జరిగిన బోనాల ఊరేగింపులో వారంతా ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్, ఓఎస్డీ సంజయ్ జాజు, ఇతర అధికారులు,సిబ్బంది, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బోనాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి భోజనం పెట్టే స్థాయికి చేరుకుందని, సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి మనదేశంలో జరగనున్న జీ20 సదస్సులో వ్యవసాయ రంగం, పేదరికంతో పాటు పలు అంశాలు ఉన్నాయని చెప్పారు. రూట్ మ్యాప్‌లో భాగంగా తెలంగాణలో యాదాద్రి మందిరం, కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్రం పెట్టిందని, కేసీఆర్ నాయకత్వాన్ని అనేక రాష్ట్రాలు కోరుకుంటున్నాయని సురేష్ రెడ్డి తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో ఈ అంశాన్ని అందరూ గమనించాలని కోరారు.

అనంతరం ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించారని, సంక్షేమంలో స్వర్ణ యుగం, అభివృద్ధి లోదేశనికి ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన నిలిచిందని అన్నారు. నిరంతరం ఆలోచనలో భాగంగా అనేక పథకాలు అమలు చేస్తున్నారని, మరోవైపు దబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని వివరించారు. కేసీ‌ఆర్ నాయకత్వంలో గ్రామీణ, పట్టణ, వ్యవసాయం, ఐటి ఇలా ఏ రంగంలో చూసిన దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. గతంలో నెర్రలు బారిన నెలలు, కరెంటు లేక తెలంగాణ ప్రజలు వలసలు వెళ్లారని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు ఇచ్చి రైతు ఆత్మహత్యలను నివారించారని వెంకటేష్ నేత సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ నేడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందన్నారు.

- Advertisement -

కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కేసీఆర్ చెరువుల పునరుద్ధరణ చేశారని, ప్రాజెక్టులను నిర్మించారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలందరికీ తాగు, సాగు నీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని సగర్వంగా తెలిపారు. 30 ఉత్తమ గ్రామాలు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే అందులో 24 గ్రామాలు తెలంగాణ గ్రామాలే ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ 26 పట్టణాల్లో 24 పట్టణాలు తెలంగాణవేనని వెంకటేష్ నేత అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని, దళితుల కోసం దళితబంధు తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారని వెల్లడించారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా అభివృద్ధిని అడ్డుకుంటోందని ఎంపీ వెంకటేష్ విమర్శఇంచారు. రానున్న రోజుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీకి దేశ ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించే పరిస్థితి లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement