Sunday, April 28, 2024

Delhi | అంతర్గత పోరుపై బీజేపీ అధిష్టానం దృష్టి.. పరిష్కారం దిశగా నేతలతో చర్చలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అసలే కర్ణాటక ఓటమి పరాభవం వెంటాడుతున్న వేళ, పక్కనే ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి కమలనాథులకు తలనొప్పిగా మారింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కాషాయదళంలో వర్గ పోరు, అంతర్గత విబేధాలు ఆ పార్టీని మూడోస్థానానికి నెట్టేశాయి. ఒకదశలో రాష్ట్రంలో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగి సవాల్ విసిరిన బీజేపీ, ఇప్పుడు ప్రత్యర్థులతో పోరు సంగతి పక్కనపెడితే, అంతర్గత పోరును పరిష్కరించడమే పెద్ద సవాలుగా మారింది.

కాంగ్రెస్‌లో ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కానీ తెలంగాణలో నేతల మధ్య పెద్ద పెద్ద అగాధాలే ఉన్నా సరే.. ఎన్నికల వేళ అన్నింటినీ పక్కనపెట్టి కర్ణాటక స్ఫూర్తితో కలసికట్టుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడో ఉండరు, పార్టీలోనే ఉండి కీచులాటలు, కుమ్ములాటలతో నష్టం చేస్తారన్న నానుడి ఉంటుంది. అయితే ఎన్ని విబేధాలున్నా.. ముందు పార్టీని గెలిపించాలి, ఆ తర్వాతే ఏదైనా అన్న చందంగా ఈ మధ్య నేతలు రాజకీయ పరిణితిని ప్రదర్శిస్తున్నారు. ఆ మేరకు సత్ఫలితాలు కూడా పొందుతున్నారు. 

- Advertisement -

ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీలో బండి సంజయ్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించినప్పటి నుంచి పార్టీలో వర్గ పోరు మొదలైంది. మొదట్లో సీనియర్ నేతలు బండి సంజయ్ నాయకత్వాన్ని అంగీకరించలేకపోయారు. బండి సంజయ్ రాజకీయ నేపథ్యం చూస్తే అప్పటి వరకు ఆయన కరీంనగర్‌లో కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా పనిచేసిన వ్యక్తి. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఆ వెంటనే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు జిల్లా స్థాయి మించి గతంలో రాష్ట్ర స్థాయిలో పనిచేసిన అనుభవం కూడా పెద్దగా లేదు. అయితే బండి సంజయ్‌కు ఉన్న పోరాట పటిమను గమనించిన జాతీయ నాయకత్వం ఏకంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించింది. ఇది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పనిచేసిన నేతలకు రుచించలేదు.

మరోవైపు బండి సంజయ్ నేతృత్వం వహించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కారణాలేవైనా సరే బీజేపీ అనూహ్య విజయాలు సొంతం చేసుకోవడం ఆయనకు క్రేజ్ తీసుకొచ్చింది. గతంలో హైదరాబాద్ నగరంతో పాటు అక్కడక్కడా మాత్రమే ఉనికి కల్గిన బీజేపీ ఉత్తర తెలంగాణలో గ్రామస్థాయికి విస్తరించింది. ఒక దశలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు అసలైన ప్రత్యర్థి బీజేపీయే అన్న దశకు చేరుకుంది. కానీ మొదటి నుంచి బండి సంజయ్‌ను జిల్లాస్థాయి నేతగానే చూస్తూ వచ్చిన సీనియర్లు ఆయనకు అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. బండి సంజయ్‌ను అభిమానించే వర్గం ఒకవైపు, పార్టీలో సీనియర్లు మరోవైపు అన్న చందంగా పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉంటే.. పార్టీలోకి కొత్తగా చేరినవారితో బండి సంజయ్‌కు పొసగని వాతావరణం నెలకొంది. కొత్తగా పార్టీలోకి చేరిన డీకే అరుణ, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు నేతలు తమను బండి సంజయ్ పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. పార్టీలో కొత్తగా చేరినవారికి మర్యాద, గౌరవం, తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. పార్టీ ఎదుగుదల కోసం తమ వ్యూహాలు, కార్యాచరణను అధిష్టానం పెద్దలు ముందు ఉంచినా సరే తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారంతా సంజయ్‌కు వ్యతిరేకంగా జట్టుకట్టారు. పార్టీలో సీనియర్లు కూడా ఈ వర్గానికి పరోక్ష మద్ధతునిస్తూ సమస్యను మరింత జఠిలం చేశారు.

ఈ పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం తెలంగాణ పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ వచ్చింది. బండి సంజయ్‌ను ఢిల్లీకి పిలిపించి ఆయన దగ్గర నుంచి కొంత సమాచారాన్ని తీసుకుంది. ఇప్పుడు ఆయన్ను వ్యతిరేకిస్తున్న వర్గం నేతలకు పిలుపు అందించింది. వారిచ్చే సమాచారాన్ని కూడా తెలుసుకున్న తర్వాత.. సమస్యకు పరిష్కారం ఎలా అందించాలో ఆలోచించే అవకాశం ఉంది. ఎన్నికల వేళ అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి.. గెలుపే లక్ష్యంగా కలసికట్టుగా పనిచేసేలా చేయడమే అధిష్టానం ముందున్న సవాల్. ఈ క్రమంలో అధిష్టానం పెద్దలు మొదలుపెట్టిన కసరత్తు ఎంత మేర ఫలిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement