Saturday, April 27, 2024

Big Story | పట్టణాల్లో పెరుగుతున్న సంక్షేమం.. సాకారం అవుతున్న సొంతింటి కల

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వైసీపీ సర్కార్‌ చేపట్టిన కొత్త పథకాలతో సం’క్షేమం’ పెరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామీణ ప్రాంతాలతో సమానంగా పట్టణ ప్రాంతాల ప్రగతిపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లో పట్ణణ ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పిల్లల చదువులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పల్లె నుంచి పట్టణాలకు వలస వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2011 నుంచీ పట్టణ ప్రాంతాల్లో జనసంఖ్య శరవేగంతో పెరుగుతోంది. గతంలో 18 శాతం ఉన్న పట్టణ ప్రాంతాల జనాభా 2021 నాటికి 37 శాతానికి పెరిగిందని అంచనా. నగరాలు, పట్టణాలుగా అంటే మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ హోదా రాని పెద్ద గ్రామాలు పట్టణ ప్రాంతాల సౌకర్యాలతో నవ్యాంధ్రలో వృద్ధిచెందుతున్నాయి.

పట్టణ హోదా ఇంకా దక్కని ఇలాంటి పెద్ద గ్రామాలను ‘సెన్సస్‌ టౌన్లు’ గా పిలుస్తారు. వెనుకబడిన ప్రాంతాలుగా ముద్రపడ్డ చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పట్టణ జనాభా బాగా అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా పెరుగుతోందని 2011 జనాభా లెక్కలు తేల్చిచెప్పాయి. పట్టణ, నగర ప్రాంతాల్లో చాలీచాలని జీతాలతో ఇంటి అద్దెలు, రవాణా ఖర్చులు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు వంటివి పేద, మధ్య తరగతి వర్గాలకు భారంలా పరిణమించే పరిస్థితి. ఈక్రమంలో వైసీ పీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆయా వర్గాలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తున్నాయి.

- Advertisement -

ఆదుకుంటున్న సంక్షేమ పథకాలు

నగరాలు, పట్టణాల్లో నెలవారీ జీతాలు వచ్చే ఉపాధి లేని ఆటో డ్రైవర్లు వంటి ఆధునిక వృత్తుల్లో ఉన్న దిగువ మధ్యతరగతి వారికి అనేక సంక్షేమ పథకాలు రూపొందించి రాష్ట్రంలో అమలుచేస్తున్నారు. నాడు – నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలలను గడిచిన నాలుగేళ్లలో తీర్చిదిద్దారు. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడంతో రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్‌ విద్య పేద, మధ్య తరగతి వర్గాల పిల్లల దరిచేరుతోంది. దీంతో తల్లిదండ్రులపై భారం తగ్గుతోంది. అమ్మఒడి, వసతి దీవెన, విద్యాకానుక వంటి పథకాలతో పేదల చదువుతకు భరోసాను ప్రభుత్వం కల్పించింది.

కాపు నేస్తం, వాహన మిత్ర, జగనన్న చేదోడు (టైలర్లు, నాయి బ్రాహ్మలు, రజకులు) ఈబీసీ నేస్తం వంటి సంక్షేమ పథకాలు పట్టణ, నగర ప్రాంతాల్లో ఆర్థికంగా తమను ఆదుకుంటున్నాయని ఆయా వర్గాల ప్రజలు చెబుతున్నారు. వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి సహా అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి బాదరబందీ లేకుండా జీవనం సాఫీగా సాగడానికి వైసీపీ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.

సాకారం అవుతున్న సొంతింటి కల

నవరత్నాల పేరిట పేదలందరికీ ఇళ్ళు పథకం పేరుతో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా పేద కుటుంబాలకు పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వడం వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల రూపంలో పట్టణాలే నిర్మితమవుతున్నాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన 50 వేల మందికి రాజధాని అమరావతిలో ఇళ్ళ స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. అద్దెల బరువు మోయలేక, అనూహ్యంగా పెరుగుతున్న భూముల ధరల నేపథ్యంలో పట్టణాల్లో స్థలాలు, ఇళ్ళు కొనుగోలు చేయలేక సొంతిల్లు కలగాలనే మిగులుతోంది అనుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ళ పథకం పట్టణ ప్రాంతాల్లోని పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వైద్య ఖర్చుల నుంచి ఉపశమనం

ప్రజారోగ్యాని రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీఠ వేసింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ లో ప్రొసీజర్ల సంఖ్యను విడతల వారీగా 3,355కు పెంచింది. రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్‌ వైద్యాన్ని అందిస్తోంది. రోగి తిరిగి కోలుకొనే వరకు రోజుకు రూ.225 చొప్పున ఆసరా ద్వారా నగదును అందిస్తోంది. ప్రభుత్వాసుపత్రుల రూపురేఖల్ని మార్చడంతో పాటు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చింది.

అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చడంతో పాటు వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేసింది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి వర్గాలకు ఆరోగ్య భరోసా కల్పించినట్టైంది. అనారోగ్యం పాలైతేనో, ప్రమాదానికి గురైతేనే వైద్య ఖర్చుల కోసం వెతుకులాట సాగించాల్సిన దుస్థితి తప్పింది. ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాల వల్ల ఆర్థికశక్తి లేని పేద ప్రజలు సైతం ఏపీలో మెరుగైన వైద్యం చేయించుకోగలుగుతున్నారు. ప్రభుత్వ పథకాల వల్ల లభించే కొనుగోలు శక్తితో పోషకాహారం తీసుకునే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.

పెరగనునున్న ఉద్యోగ అవకాశాలు

కొత్త పరిశ్రమలు స్థాపన సహా అన్ని రకాల వ్యాపార, వాణిజ్య రంగాలకు ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలా అనువైనదని అనేక సర్వేలు ఇటీవల వెల్లడించాయి. కొత్త పెట్టు-బడులకు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, వ్యాపారాలకు ఏపీ అత్యంత ప్రయోజనకరమైనదని ఈ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పెద్ద తెలుగు రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ, వ్యాపార సుస్థిరత నూతన పెట్టుబడులను ఆకర్షిస్తోంది. మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబెల్‌ సమ్మిట్‌ ఒప్పందాల్లో పెట్టుబడులు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. కొత్త పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆంధ్రప్రభ టెలిగ్రామ్ చానెల్ లింక్ https://t.me/prabhaanews క్లిక్ టు జాయిన్

Advertisement

తాజా వార్తలు

Advertisement