Thursday, May 16, 2024

ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తరు కానీ, పంటలను కొనరా?.. బీజేపీ ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం!

ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ఫండ్స్​ ఇవ్వకుండా డిస్టర్బ్​ చేయడం, ఎమ్మెల్యేలకు కోట్లకొద్ది డబ్బులు ముట్టజెప్పీ కొనుగోలు చేయడం.. ఉన్నఫలంగా రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి అధికారంలోకి రావడం వంటి విపరీత చర్యలకు బీజేపీ పాల్పడుతోంది. ఇంత చేస్తున్న ఆ పార్టీ రైతులకు, పేదలకు మంచి చేయడంలో చొరవచూపడం లేదు. పెద్దమొత్తంలో టాక్సులు పెంచి, అన్నిటి మీద జీఎస్టీ రూపంలో దండుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో మాత్రం వెనుకడుగు వేస్తోంది. ఆ పార్టీ లీడర్లు శాసనసభ్యులను “కొనుగోలు” చేసే ఆలోచన చేస్తున్నారు కానీ,  రైతుల పంటలను మాత్రం కొనుగోలు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

మధ్యప్రదేశ్​లో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడి రైతుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తోంది. అక్కడి రైతులు ఎక్కువగా పండించే వెల్లుల్లిని కొనుగోలు చేయకపోవడంతో కాలువలు, నదులు, మార్కెట్లలోనే పారబోస్తున్నారు. రూపాయికి కిలో అమ్ముకోలేక, పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో బీజేపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో రైతులు తమ ఉత్పత్తులకు తక్కువ ధర లభించడంతో వెల్లుల్లి నింపిన బస్తాలను రోడ్లపై, నదులు, కాలువల్లో విసిరేస్తున్నట్లు చూపించే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మధ్యప్రదేశ్​ ప్రభుత్వం వెల్లుల్లికి గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు కిలో రూపాయికే అమ్ముకుంటున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం తీరువల్ల విపరీతంగా పెట్టుబడులు పెరిగాయని, ఎరువులు, విత్తనాలు, డీజిల్ ధరలు ఇప్పటికే రైతులను తీవ్రంగా దెబ్బతీశాయని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు తమ పంట దిగుబడులకు పెట్టుబడి ఖర్చు కూడా పొందలేని పరిస్థితి దాపురించిందని ఆందోళన చెందుతున్నారు. బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కొంతమంది రైతులు వెల్లుల్లు బస్తాలను నదులు, కాలువల్లో పారబోస్తున్నారు. ఇంకొంతమంది మార్కెట్లలోనే సంచులను వదిలేసి వెళ్తున్నారు.

ఇక.. ఇవ్వాల (మంగళవారం) మధ్యప్రదేశ్​ ప్రతిపక్ష కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు రైతుల పక్షాన అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు. వెల్లుల్లి సంచులతో అసెంబ్లీ గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్​ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం తొలిరోజున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సచిన్ యాదవ్, జితు పట్వారీ, కునాల్ చౌదరి, పీసీ శర్మ తదితరులు వెల్లుల్లిపాయలతో నిండిన సంచులను భుజాలపై వేసుకుని అసెంబ్లీ గేట్ నంబర్ 3 ముందు ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం రైతులపట్ల దారుణంగా ప్రవర్తిస్తోందని, తమ పంటలకు గిట్టుబాటు కల్పించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భుజాలపై వెల్లుల్లిపాయల బస్తాలు తెచ్చిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు వద్దే సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడే బస్తాలను చింపి విసిరిపారేసి నిరసన ప్రదర్శన చేశారు. ప్రభుత్వం రైతుల నుండి వెల్లుల్లిని కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు.

- Advertisement -

ప్రభుత్వం వెంటనే ‘భవంతర్ యోజన’ (ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధరలో వ్యత్యాసాన్ని భర్తీ చేయడం) అమలు చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్​ నేతలు డిమాండ్ చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్​ నిలబడుతుందని, ఎంతటి పోరాటానికైనా రెడీగా ఉంటామని తెలిపారు. “కిసానో కే సమ్మాన్ మే, కాంగ్రెస్ మైదాన్ మే” అంటూ నినాదాలు చేశారు. ఈ ఏడాది వెల్లుల్లి సాగులో రూ.3 లక్షల నష్టం వాటిల్లిందని ఆందోళనలో పాల్గొన్న రైతు సిసోడియా పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇన్‌పుట్ ఖర్చు కూడా వారికి అందడం లేదని ఎమ్యెల్యే సచిన్ యాదవ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement